YS Sharmila Target YS Jagan:మళ్లీ జగనే టార్గెట్‌గా షర్మిల అర్థంపర్థం లేని విమర్శలు..!
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల ప్రతీ విషయానికి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డికే తప్పని తేల్చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల ప్రతీ విషయానికి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డికే తప్పని తేల్చేస్తున్నారు. అధికారపక్షాన్ని విమర్శించకుండా విపక్షంలో ఉన్న జగన్(YS Jagan)పైనే ఎక్కువగా కారాలు మిరియాలు నూరుతుంటారు. ఏపీ(AP)లో మొన్న వచ్చిన వరదలకు జగన్మోహన్‌రెడ్డే కారణమని ఆమె భాష్యం చెప్పారు. టీడీపీ కంటే ఎక్కువగా జగన్‌ను ఈమె విమర్శించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. విజయవాడ(Vijayawada)ను వరద ముంచెత్తడానికి బుడమేర గండ్లను గత ప్రభుత్వం పట్టించుకోకపోవడమే కారణమని షర్మిల(YS Sharmila) విమర్శించిన విషయం తెలిసిందే. ఇవాళ కూడా మీడియాతో మాట్లాడుతూ జగన్‌పై మరోసారి ఘాటైన విమర్శలు చేశారు. ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురిశాయి. ఫలితంగా ఏలేరుకు వరద వెల్లువెత్తింది. వందల ఎకరాల్లో పంట నష్టపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandra Babu), డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్(Pawan kalyan) ఇటీవల ఆ ప్రాంతాల్లో పర్యటించారు. పనిలో పనిగా ఏలేరు వరదకు(Eleru Floods)కూడా జగనే కారణమని వారిద్దరు విమర్శించారు. చంద్రబాబు, పవన్‌లు విమర్శించగా లేనిది తాను మాత్రం సైలెంట్‌గా ఎందుకుండాలనుకున్నారో ఏమో కానీ షర్మిల కూడా మీడియా సమావేశం పెట్టి మరీ జగన్‌ను విమర్శంచారు. ఏలేరు ఆధునీకరణ జరగకపోవడం, పూడిత తియ్యకపోవడం వల్లే వరద వచ్చిందన్నారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి(YSR) సీఎంగా ఉన్నప్పుడు ఏలేరు ఆధునీకరణకు నిధులు కేటాయించి, శంకుస్థాపన చేశారని ఆమె గుర్తు చేశారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు మాత్రం ఆ విషయాన్ని పట్టించుకోలేదన్నారు. రాజశేఖర్‌రెడ్డి శంకుస్థాపన చేశారు సరే.. ఆయన చనిపోయిన తర్వాత నాలుగున్నరేళ్ల పాటు కాంగ్రెస్ ముఖ్యమంత్రులే రాష్ట్రాన్ని ఏలారు కదా! మరి వారికి కూడా షర్మిల అనాలి కదా! వారంటే సొంత పార్టీ వారు అనుకుందాం! 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు సీఎంగా ఉన్నారు కదా! మరి ఆయనేం చేసినట్టు? చంద్రబాబును అనకుండా కేవలం జగన్‌నే ఆడిపోసుకోవడం ఏమిటి? రోశయ్య కానీ, కిరణ్‌కుమార్ రెడ్డి కానీ, చంద్రబాబు కానీ ఆధునీకరణ పనులు ఎందుకు చేయలేదు? మరి వీరిని షర్మిల ఒక్క మాట కూడా ఎందుకు అనడం లేదన్నదే ప్రశ్న!