YS Sharmila: వైఎస్ షర్మిలకు ఎన్నికల సంఘం నోటీసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఎన్నికల సంఘం నోటీసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఏపీలో మే 13న సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. షర్మిల తన ప్రచారంలో వివేకా హత్యపై ప్రస్తావించారని, వైసీపీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఈసీకి ఫిర్యాదులు అందాయి. షర్మిలపై వైసీపీ నేతలు మల్లాది విష్ణు, అవినాశ్ రెడ్డి, వివేకా హత్య కేసు అప్రూవర్ దస్తగిరి ఫిర్యాదులు చేశారు. ఈ ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకున్న ఎన్నికల సంఘం షర్మిలకు నోటీసులు పంపింది. ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై వివరణ ఇవ్వాలంటూ నోటీసుల్లో స్పష్టం చేసింది. 48 గంటల్లో వివరణ ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామని ఈసీ హెచ్చరించింది.
వైఎస్ షర్మిలా రెడ్డి నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉదయం 9:30 నుంచి కడప నగరంలో సునీతా రెడ్డితో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులతో కలిసి భారీ ర్యాలీ చేపట్టనున్నారు. ఉదయం 11.10 గంటలకు కడప కలెక్టరేట్‌లో నామినేషన్ వేయనున్నారు. నామినేషన్ దాఖలు అనంతరం షర్మిల భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.