మాజీ మంత్రి రోజా సెల్వమణికి(Roja Selvaraju) ఇప్పుడు ప్రశాంతత వచ్చింది.
మాజీ మంత్రి రోజా సెల్వమణికి(Roja Selvaraju) ఇప్పుడు ప్రశాంతత వచ్చింది. పంటికింద రాయిలా, చెవిలో జోరిగలా ఇప్పటి వరకు రోజాను సతాయిస్తూ వచ్చినవారిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి(YS Jagan ). నగరి నియోజకవర్గానికి చెందిన వైసీపీ ట్రేడ్ యూనియన్ కార్యదర్శి కె.జె.కుమార్(KJ Kumar), ఈడిగ కార్పొరేషన్ మాజీ ఛైర్‌పర్సన్ కె.జె.శాంతి, వారి కుటుంబసభ్యలను పార్టీ నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ సిద్ధాంతాలకు, పార్టీ ఆశయాలకు విరుద్ధంగా పని చేస్తున్నారని అధిష్టానం గుర్తించింది. పార్టీ నుంచి వారిని తొలగించడమే కాకుండా పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేశారు. ఓ రకంగా రోజాకు అధినేత జగన్ ఇచ్చిన కానుకగానే చెప్పుకోవచ్చు. మొన్నటి ఎన్నికల్లో రోజా ఓటమికి వీరు కూడా ఓ కారణం. రోజా ఓటమి కోసం వీరు గట్టిగానే పని చేశారు. రోజా ఓడిపోయిన రోజున కె.జె.శాంతి, ఆమె కుటుంబసభ్యులు పండుగ చేసుకున్నారు. పైగా ఓ వీడియో విడుదల చేస్తూ అందులో నగరి నియోజకవర్గానికి పదేళ్లుగా పట్టిన శని పీడ విరగడైన రోజు కాబట్టి అందరం ఆనందంగా ఉన్నామని చెప్పారు. రోజాకు టికెట్ ఇవ్వకుండా ఉండి ఉంటే పార్టీకి ఈ పరిస్థితి వచ్చేది కాదని వీడియోలో చెప్పారు. అప్పట్నుంచే రోజా వీరిపై అధిష్టానికి ఫిర్యాదు చేస్తూ వచ్చారు. ఇన్నాళ్లకు వారిపై చర్యలు తీసుకున్నది అధినాయకత్వం! మొత్తంమీద రోజాకు ఇంటి శత్రువుల బెడద తీరింది