YS Jagan : ఫలించిన జగన్ వ్యూహం.. బొత్స గెలుపు నామమాత్రమే!
ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక ఎమ్మెల్సీ(Vizag MLC Elections) ఎన్నికలో పోటీ చేయకూడదని తెలుగుదేశంపార్టీ(TDP) నిర్ణయించుకుంది.
ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక ఎమ్మెల్సీ(Vizag MLC Elections) ఎన్నికలో పోటీ చేయకూడదని తెలుగుదేశంపార్టీ(TDP) నిర్ణయించుకుంది. పోటీకి వెనుకంజ వేసింది. ఎన్నికలో విజయం సాధించలేమని చంద్రబాబుకు(Chandrababu) అర్థమయ్యింది. పోటీ చేసి పరాజయంపాలు కావడం కంటే తప్పుకుంటేనే బెటరనే భావనకు ఆయన వచ్చారు. నిన్నటి వరకు బరిలో దిగుతామని చెప్పిన టీడీపీ అందుకోసం కాపు సామాజికవర్గానికి చెందిన బైరా దిలీప్‌ను సంసిద్ధం కూడా చేసింది. సడన్‌గా ఇప్పుడు పోటీ నుంచి వైదొలుగుతున్నట్టు టీడీపీ ప్రకటించింది. ఓడిపోతే పరువు పోతుందన్న ఉద్దేశంతోనే వెనుకంజ వేసినట్టు అర్థమవుతోంది. అధికారంలో ఉండి కూడా గెలువలేకపోతే అది మరింత అప్రతిష్ట. మరి ఏ ధీమాతో నిన్నటి వరకు పోటీ చేయడానికి ఉరుకులాడిందో తెలియడం లేదు. ఓటుకు నోటు వర్క్‌అవుట్ కాదని టీడీపీ తెలుసుకున్నట్టుగా ఉంది. విశాఖ స్థానిక సంస్థల ఎన్నికలో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లవి కలిపి మొత్తం 838 ఓట్లు ఉన్నాయి. ఇందులోవైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి 543 వరకు ఓట్లు ఉన్నాయి. తెలుగుదేశంపార్టీకి (Janasena,BJP కలిపి) ఇంచుమించు 200 ఓట్లు ఉంటాయంతే! పరువు పోతుందన్న భయంతోనే టీడీపీ పోటీ నుంచి వైదొలిగిందని చెప్పుకుంటున్నారు. పైగా బొత్స సత్యనారాయణ వ్యూహాల ముందు నిలబడలేమని భావించింది. ఒకవేళ టీడీపీ పోటీ చేస్తే అది దుశ్చర్యే అవుతుందని బొత్స ఇదివరకే వ్యాఖ్యానించారు. నిజానికి పోటీ చేయాలనే ఉద్దేశంతోనే తెలుగుదేశంపార్టీ వ్యూహాలు రచించుకుంది. గెలుపుకు కావాల్సినంత మందిని ఈజీగా రాబట్టుకోవచ్చని అనుకుంది. అధికార పార్టీ ఆహ్వానిస్తే రాకుండా ఎవరుంటారని అభిప్రాయపడింది. అయితే ఇది చాలా కష్టమైన పని అని గ్రౌండ్‌లో దిగితే కానీ అర్థం కాలేదు. ఈ ఎన్నిక విషయంపై కూటమి, వైసీపీ మధ్య మాటల యుద్ధం నడిచింది. ఎలాగైనా సరే ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకుంటామని జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ చెప్పడమే చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. వంశీకృష్ణ రాజీనామా చేయడం వల్లనే ఉప ఎన్నిక వచ్చిన సంగతి తెలిసిందే కదా! ఇప్పుడు కూటమి నేతలు కూడా సైలెంటయ్యారు. ఈ స్థానం నుంచి బొత్స సత్యనారాయణను నిలబెడితే ప్రత్యర్థులు జంకుతారని జగన్ ఊహించారు. ఆయన ఊహించినట్టుగానే ఇప్పుడు జరిగింది. పైగా బొత్స గెలుపును జగన్ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మొత్తం మీద జగన్ వ్యూహం ఫలించింది. బొత్స మండలిలో అడుగుపెట్టడం ఖాయం!