ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తారా?

ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల మొదటి రోజు, చివరి రోజు ఆసక్తికర సన్నివేశాలు కనిపించాయి. తొలి రోజు గవర్నర్‌ ప్రసంగం సందర్భంగా జగన్‌ (YS jagan)తమ పార్టీ ఎమ్మెల్యేలతో సభకు వచ్చారు. అదంతా అనర్హత వేటు నుంచి తప్పించుకోవడానికేనని చర్చ జరిగింది. అయితే.. చివరి రోజు స్పీకర్‌ చేసిన ప్రకటన జగన్‌ను, వైసీపీ ఎమ్మెల్యేలను మరింత ఇరకాటంలో పడేసింది.

తొలి రోజు తన టీమ్‌తో సభకు వచ్చిన జగన్ 11 నిమిషాలు కూడా గడపకుండానే వాకౌట్ చేశారు. గవర్నర్(Governor) ప్రసంగిస్తున్న సమయంలో వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ వైసీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. శాసనసభ్యుడిగా గతేడాది ప్రమాణ స్వీకారం చేశాక రెండోసారి మాత్రమే జగన్‌ అసెంబ్లీకి వచ్చి వెళ్లారు. ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టేందుకు ఏర్పాటు చేసిన రిజిస్టర్‌లో ఆయన సంతకం చేశారు. తర్వాత సభలోకి వెళ్లి కాసేపటికే బాయ్‌కాట్‌ చేసి వెళ్లిపోయారు. 60 రోజులపాటు వరుసగా సభకు హాజరవకపోతే ఆటోమెటిక్‌గా అనర్హత వేటు పడుతుందని సభాపతి, ఉపసభాపతి ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో హాజరు కోసమే జగన్‌ సభకు వచ్చారని చర్చ జరిగింది.

జగన్‌ సభకు వచ్చి సంతకమైతే పెట్టి వెళ్లారు కానీ, దాన్ని హాజరుగా పరిగణించే అవకాశం లేదని అసెంబ్లీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. సభలో స్పీకర్‌ అధ్యక్షతన జరిగే సమావేశాలనే పనిదినాలు, సిట్టింగ్‌గా పరిగణిస్తారు. తొలి రోజు శాసనసభ(Assembly), శాసనమండలి సభ్యులను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగించారు. వేదికపై మండలి ఛైర్మన్, అసెంబ్లీ స్పీకర్‌ కూడా ఉన్నారు. సభకు ముగ్గురు అధ్యక్షత వహించే పరిస్థితి ఉండదు కాబట్టి, ఈ ప్రసంగాన్ని సిట్టింగ్‌ కిందికి తీసుకోరని అంటున్నారు.

ఈ చర్చ నేపథ్యంలోనే ఏడుగురు వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చి హాజరు పట్టికలో సంతకాలు పెట్టి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని స్పీకర్ అయ్యన్నపాత్రుడు(Ayyanna patrudu) సభలో ప్రకటించడం హాట్‌ టాపిక్‌గా మారింది. వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు శాసనసభకు రాకుండా సంతకాలు చేస్తుండటంపై అయ్యన్నపాత్రుడు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరవడం మీరెవరైనా చూశారా? అంటూ సభ్యులను స్పీకర్‌ ప్రశ్నించారు. వైసీపీ సభ్యులు ఎవరికీ కనపడకుండా దొంగచాటుగా వచ్చి రిజిస్టర్‌లో సంతకాలు చేయాల్సిన పనేముందని అసహనం వ్యక్తం చేశారు.

వైసీపీ సభ్యులు బాలనాగిరెడ్డి(BalaNagi reddy), తాటిపర్తి చంద్రశేఖర్‌(Tatiparti Chandra Shekar), మత్స్యలింగం, విరూపాక్ష(Virupaksha), విశ్వేశ్వరరాజు(Vishweshwara Raju), ఆకేపాటి అమర్నాథ్‌రెడ్డి(Amarnath reddy), దాసరి సుధ(Dasari Sudha) సంతకాలు చేసినట్లు తేలిందని స్పీకర్‌ వెల్లడించారు. హాజరు పట్టికలో వారి సంతకాలు ఉన్నా వాళ్లు సభకు వచ్చినట్టు గుర్తించడం లేదని స్పీకర్ స్పష్టం చేశారు.

వాస్తవానికి అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపు మాజీ సీఎం జగన్ మరోసారి సభకు హాజరవుతారన్న చర్చ జరిగింది. ఆ ఏడుగురు ఎమ్మెల్యేలు మాత్రం అలా సీక్రెట్‌గా వచ్చి సంతకాలు చేసి వెళ్లారు. ఆ సంతకాలను కూడా స్పీకర్ పరిగణనలోకి తీసుకోనంటున్నారు. మరి వైసీపీ ఎమ్మెల్యేలపై శాసనసభ నియమాల ప్రకారం ఎలాంటి యాక్షన్ ఉంటుందో? వేచి చూడాలి.

ehatv

ehatv

Next Story