వైసీపీ(YCP) అధినేత జగన్(YS jagan) ఢిల్లీలో(Delhi) చేపట్టిన ధర్నా దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిందనే చెప్పాలి.

వైసీపీ(YCP) అధినేత జగన్(YS jagan) ఢిల్లీలో(Delhi) చేపట్టిన ధర్నా దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిందనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని, ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలన్న డిమాండ్‌తో జంతర్ మంతర్‌లో(Jantar mantar) జగన్‌ చేపట్టిన ధర్నా జాతీయ నేతల దృష్టిని ఆకర్షించింది. గత పదేళ్లుగా ఎన్డీఏ(NDA) కూటమికి దగ్గరగా ఉన్న జగన్‌ పలు అంశాల్లో బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. రాష్ట్రపతి అభ్యర్థిత్వం సహా పలు బిల్లులకు ఇటు లోక్‌సభ, అటు రాజ్యసభలో మద్దతు ఇచ్చారు. అయితే ఏపీలో కూటమి ప్రభుత్వం మారిపోయిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి. రాజ్యసభలో తమ ఎంపీల మద్దతు కావాలంటే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని వైసీపీ డిమాండ్‌ కూడా చేసింది. జగన్‌ ఢిల్లీలో చేపట్టిన ధర్నాకు అనూహ్యంగా ఇండియా కూటమి నేతలంతా సంఘీభావం తెలిపారు. జగన్‌కు మద్దతిచ్చి ఇండియా కూటమిలోకి రావాలని కోరారు.

వినుకొండ(Vinukonda) హత్య తర్వాత బెంగళూరు నుంచి నేరుగా బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలన్న డిమాండ్‌తో జగన్‌ చేపట్టిన ధర్నాకు ఇండియా నేతలు మద్దతు ఇచ్చారు. అయితే జగన్‌ వ్యూహాత్మకంగానే ఢిల్లీలో ధర్నా చేపట్టి ఇండియా కూటమి నేతల మద్దతు కూడగట్టారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇండియా కూటమిలో కాంగ్రెస్ తర్వాత అధిక సీట్లు సాధించిన సమాజ్‌ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ జగన్‌కు మద్దతు తెలపడంతో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా ఇండియా కూటమిలో మరో పెద్ద పార్టీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కూడా జగన్‌కు గట్టి మద్దతు ప్రకటించింది. శివసేన, ఇండియన్ ముస్లిం లీగ్ వంటి పార్టీలూ మేమున్నాం అంటూ వైసీపీకి బాసటగా నిలిచాయి.

ఇప్పటికే కాంగ్రెస్‌ ఏపీ అధ్యక్షురాలిగా కొనసాగుతున్న షర్మిల(YS sharmila) గత ఎన్నికల్లో కాంగ్రెస్‌(Congress) అభ్యర్థులను నెలబెట్టి వారికి మద్దతుగా ప్రచారం చేసింది. కాంగ్రెస్‌ ఓటు బ్యాంకుకు తోడు మైనార్టీ, దళితుల ఓట్లను కొంత మేర రాబట్టుకోగలిగింది. రాయలసీమలో చాలా చోట్ల వైసీపీ అభ్యర్థులు ఓడిపోవడానికి ఈ తక్కువ ఓటుబ్యాంకు కూడా ఒకందుకు కారణమని జగన్‌ భావిస్తున్నారట. గత పదేళ్లుగా జగన్‌ బీజేపీతో అంటకాగుతున్నాడని, బీజేపీ చెప్పినట్లు జగన్‌ నడుచుకుంటున్నాడని షర్మిల చేసిన ప్రచారం కూడా వైసీపీ ఓట్లను దెబ్బతీశాయని విశ్లేషకులు అంచనా వేశారు. దీంతో మేలుకున్న జగన్‌ ఢిల్లీలో ధర్నా పెడితే బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతన్నారన్న భావన ప్రజల్లో కలగడమే కాకుండా ఇండియా కూటమి పక్షాలకు దగ్గర కూడా కావొచ్చని అనుకొని ఉండొచ్చు. దీంతో మైనార్టీ, దళిత ఓటు బ్యాంకు వైసీపీకి దూరం కాకూడదన్న వ్యూహంలో భాగంగానే జగన్ ధర్నా చేపట్టారని తెలుస్తోంది. దీంతో షర్మిలకు చెక్ పెట్టొచ్చని జగన్‌ వ్యూహం ఉండొచ్చని చర్చించుకుంటున్నారు. అయితే జగన్‌ను ఇండియా కూటమిలోకి ఆహ్వానిస్తున్నా స్థానికంగా జగన్ టార్గెట్‌గా రాజకీయం చేస్తున్న పీసీసీ అధ్యక్షురాలు షర్మిల వైఖరి ఎలా ఉంటోందన్న చర్చ నడుస్తోంది. ఇండియా కూటమికి జగన్‌ దగ్గరైతే షర్మిల ఎంత వరకు సహకరిస్తుందనే ప్రశ్న తలెత్తుతోంది. పద్మవ్యూహం లాంటి ఈ పరిస్థితుల నుంచి ఆయన ఎలా బయటకు వస్తారనేది ఉత్కంఠ రేపుతోంది.

మరోవైపు చంద్రబాబు కూడా జగన్‌ హయాంలో జరిగిన అవినీతిని వెలికితీస్తామని, విచారణలు ఎదుర్కోవాల్సి వస్తుందని బహిరంగాగానే ప్రకటిస్తున్నారు. దీంతో అటు ఎన్డీఏ కూటమిలో లేక ఇటు ఇండియా కూటమిలో లేకపోతే రాజకీయంగా తనకు ఇబ్బందులు వస్తాయని భావించే ఇండియా కూటమికి దగ్గర అవుతున్నారని రాజకీయవిశ్లేషకుల అంచనా. గత ఎన్నికల్లో ఏ కూటమిలోలేని జగన్, కేసీఆర్(Kcr), నవీన్‌ పట్నాయక్‌ ఓటమి కూడా ఇందుకు కారణమై ఉండొచ్చని చెప్తున్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో ఇండియా వర్సెస్ ఎన్డీఏ అన్నట్లుగా ఎన్నికలు జరిగాయని, దీంతో ప్రాంతీయ పార్టీలను ప్రజలు లెక్కలోకి తీసుకోవడం లేదని తేలడంతో ఏదో ఒక కూటమి దగ్గర కావాలన్నదే జగన్‌ ప్రయత్నం అయ్యి ఉండొచ్చని భావిస్తున్నారు. ఓటమితో భవిష్యత్‌లో తాను ఎదుర్కోబోయే గడ్డు పరిస్థితులపై జగన్‌కు అవగాహన ఉంది. వాటిని ఎదుర్కొనేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని అనుకోవచ్చు.

Eha Tv

Eha Tv

Next Story