YS Jagan: విద్యా దీవెన నిధులను విడుదల చేసిన సీఎం జగన్
పేదలకు మంచి చేయటం కోసం యుద్ధం చేయాల్సి వస్తోందని సీఎం జగన్
కృష్ణా జిల్లా పామర్రులో రూ.708.68 కోట్ల ‘జగనన్న విద్యా దీవెన’ నిధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విడుదల చేశారు. రాష్ట్రంలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న 9.44 లక్షల మంది విద్యార్థులకు 2023 అక్టోబరు-డిసెంబరు త్రైమాసికానికి సంబంధించిన నిధులను బ్యాంకు ఖాతాలకు జమ చేశారు. విద్యా దీవెన, వసతి దీవెన పథకాలకు ఇప్పటి వరకూ రూ.18,002 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది.
పేదలకు మంచి చేయటం కోసం యుద్ధం చేయాల్సి వస్తోందని సీఎం జగన్ అన్నారు. ఇంగ్లీష్ మీడియం పేదలకు పెట్టడం కోసం యెల్లో మీడియా, చంద్రబాబు, దత్త పుత్రుడుతో యుద్ధం చేశానన్నారు. పెత్తందారీ మనస్తత్వాలు గుర్తించాలని.. విమర్శలు చేసే వాళ్ళ పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియంలో చదవాలన్నారు. విద్యా రంగంలో కూడా క్లాస్ వార్ జరుగుతోందన్నారు. పిల్లలకు ట్యాబ్ లు ఇస్తే తప్పని ప్రచారం చేస్తున్నారన్నారు. పెద్ద చదువులు చదువుకుంటున్న పేదింటి పిల్లల వారి పూర్తి ఫీజులు, పూర్తి డబ్బు మొత్తాన్ని వంద శాతం ఫీజును ఆ పిల్లల తల్లులకే ఇచ్చి, తల్లులే ఆ ఫీజులు కాలేజీలకు కట్టే ఈ జగనన్న విద్యా దీవెన కార్యక్రమాన్ని గత 57 నెలలుగా క్రమం తప్పకుండా ప్రతి త్రైమాసికం అయిపోయిన వెంటనే ఆ తల్లులకు జమ చేస్తూ జగనన్న విద్యా దీవెన కొనసాగిస్తూ ఉన్నామన్నారు.