RGUKT: ఆ విషయంలో కీలక చట్ట సవరణ చేసిన ఏపీ ప్రభుత్వం
ఆర్‌జీయూకేటీ కులపతిగా సీఎం ఉండేందుకు వీలుగా తీసుకొచ్చిన చట్ట సవరణ బిల్లును
ఆంధ్రప్రదేశ్‌లో ఓ యూనివర్సిటీకి ముఖ్యమంత్రి చాన్సలర్ గా వ్యవహరించేలా చట్టానికి సవరణలు చేశారు. రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్‌జీయూకేటీ) ఛాన్సలర్‌గా సీఎం వ్యవహరించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు బుధవారం అసెంబ్లీ ఆమోదం తెలిపింది. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. యూనివర్సిటీలకు సాధారణంగా గవర్నర్లు కులపతులుగా వ్యవహరిస్తూ ఉంటారు. కానీ కొన్ని రాష్ట్రాలలో ఆయా వర్సిటీలకు సీఎంలే ఛాన్సలర్లుగా ఉండేలా చట్టానికి సవరణలు చేశారు. ఏపీలో ట్రిపుల్ ఐటీల కోసం ఏర్పాటు చేసిన ఆర్‌జీయూకేటీకి ముఖ్యమంత్రి కులపతిగా ఉండేలా చట్టాన్ని సవరించారు.
ఆర్‌జీయూకేటీ కులపతిగా సీఎం ఉండేందుకు వీలుగా తీసుకొచ్చిన చట్ట సవరణ బిల్లును విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టగా సభ ఆమోదం తెలిపింది. మరో రెండు సవరణ బిల్లులకూ ఆమోదం లభించింది. పేదలకు ఇచ్చిన ఇంటి స్థలానికి పదేళ్ల అనంతరం భూ యాజమాన్య హక్కు కల్పించే సవరణ బిల్లును మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రవేశపెట్టారు. దీనివల్ల ప్రభుత్వం మహిళల పేరిట ఇచ్చిన ఇంటి స్థలంలో ఇల్లు నిర్మించుకొని, పదేళ్ల తర్వాత అమ్ముకునేందుకు వీలుంటుందని మంత్రి తెలిపారు. ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్టు, ఇతర విధానాల్లో చేరిన వారిలో క్రమబద్ధీకరణ పొందిన ఉద్యోగులకు, అంతకు ముందున్న సర్వీసును పింఛను ప్రయోజనాలకు లెక్కించకూడదనే సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది.