Ys Jagan Press Meet : వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రెస్ మీట్లోని ముఖ్యాంశాలు
బాబు ష్యూరిటీ. మోసం గ్యారెంటీ:
ఎన్నికల ముందు, చంద్రబాబుగారి నోట మాట ఏమిటంటే.. బాబు ష్యూరిటీ. భవిష్యత్తు గ్యారెంటీ. కానీ, ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే.. బాబు ష్యూరిటీ. మోసం గ్యారెంటీ అన్నట్లుగా మారింది.
సూపర్‌సిక్స్, సూపర్ సెవెన్ అన్నాడు. మ్యానిఫెస్టోలో 143 హామీలు ఇచ్చి, ఇంటింటికీ ప్రచారం చేశారు. ఇంకా ఆ హామీలకు గ్యారెంటీ అంటూ బాండ్లు చూపారు. ఇంటింటికీ పంచారు. అమలు చేయలేకపోతే చొక్కా పట్టుకోమన్నారు. నిలదీయమన్నారు. అప్పుడు మీరిచ్చిన బాండ్లు ఏమయ్యాయి? మ్యానిఫెస్టో ఏమైంది? పంచిన పాంప్లెంట్లు ఏమయ్యాయి? ఎవరి చొక్కా పట్టుకోవాలి.
రికార్డు స్థాయిలో అప్పులు:
మరోవైపు రాష్ట్ర అప్పులు ఈ 9 నెలల్లోనే రికార్డుల బద్ధలు కొట్టాయి. గతంలో ఏ ప్రభుత్వం ఈ స్థాయిలో అప్పులు చేయలేదు. 9 నెలల కాలంలోనే బడ్జెటరీ అప్పులే రూ.80,827 కోట్లు.ఇంకా అమరావతి పేరు చెప్పి ఇప్పటికే తెచ్చిన అప్పులు. తేబోతున్న అప్పులు మరో రూ.52 వేల కోట్లు. ఇందులో ప్రపంచ బ్యాంక్ నుంచి రూ.15 వేల కోట్లు. జర్మనీ కెఎఫ్‌డబ్ల్యూ నుంచి రూ.5 వేల కోట్లు. హడ్కో నుంచి రూ.11 వేల కోట్లు. సీఆర్‌డీఏ కమిట్ అయిన అప్పులు మరో రూ.21 వేల కోట్లు.
ఇవికాక మార్క్‌ఫెడ్, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా మరో రూ.8 వేల కోట్లు, ఏపీ ఎండీసీ ద్వారా తేబోతున్న అప్పులు మరో రూ.5 వేల కోట్లు.
అన్నీ కలిపితే ఇప్పటికే చేసిన, తెస్తున్న అప్పులు ఏకంగా రూ.1.45 లక్షల కోట్లకు పైగానే. ఇది నిజంగా రికార్డు. ఎవరూ బద్దలు కొట్టలేని రికార్డు.
పథకాలన్నీ పాయే:
పిల్లల చదువుల కోసం ఇచ్చిన అమ్మ ఒడి పాయే.. రైతు భరోసా పథకం పాయే.. వసతి దీవెన పాయే.. విద్యా దీవెన అరకొర. చేయూత లేదు. ఆసరా లేదు. సున్నా వడ్డీ, ఆరోగ్యశ్రీ పూర్తిగా ఎగనామమే. వాహనమిత్ర, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, చేదోడు, తోడు, లా నేస్తం... గతంలో ఉన్న పథకాలన్నీ పాయే.. పిల్లలకు ట్యాబ్‌లు ఇచ్చే పథకం కూడా పాయే.నేను అడుగుతున్నా. రూ.1.45 లక్షల కోట్ల అప్పులు. చేసినవి. చేస్తున్నవి. ఎవరి జేబులోకి పోతున్నాయి?
ఉద్యోగాలు లేవు. ఉన్నవే ఊడగొట్టారు:
ఈ 9 నెలల కాలంలో కొత్త ఉద్యోగాలు లేకపోగా, ఉన్న ఉద్యోగాలే ఊడగొట్టారు. 2.60 లక్షల వాలంటీర్ల ఉద్యోగాలు ఊడగొట్టాడు. 18 వేల మంది బెవరేజెస్ కార్పొరేషన్ ఉద్యోగాలు పాయే.. ఫైబర్‌నెట్, ఏపీఎండీసీ, ఫీల్డ్ అసిస్టెంట్స్, వైద్య ఆరోగ్య శాఖ.. ఆయా విభాగాల్లో వేల సంఖ్యలో ఉద్యోగాలు తీసేశారు.
గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగస్తులను కూడా సచివాలయాల నుంచి తరలించి, వేరే శాఖల్లో సర్దుతున్నారు. అలా ఆ ఉద్యోగాలు కుదిస్తున్నారు.
ప్రభుత్వ ఉద్యోగులనూ మోసం చేశారు. మీ ప్రభుత్వం రాగానే ఐఆర్ (మధ్యంతర భృతి) అన్నాడు. 9 నెలలైంది. ఒక్క రూపాయి ఇవ్వలేదు.
ఉద్యోగులకు మెరుగైన పీఆర్‌సీ అన్నాడు. ఉన్న పీఆర్‌సీ ఛైర్మన్‌ను బలవంతంగా రాజీనామా చేయించారు. కొత్త పీఆర్‌సీ వేయలేదు.
ఒకటో తేదీనే జీతాలు అన్నాడు. ఒకే ఒక నెల మాత్రమే ఇచ్చాడు. తర్వాత ఏనాడూ ఇవ్వలేదు.
మూడు డీఏలు పెండింగ్. ట్రావెల్ అలవెన్స్‌లు, సరెండర్ లీవ్స్, మెడికల్ రీయింబర్స్‌మెంట్.. అన్నీ పెండింగ్. చివరకు ఉద్యోగస్తులకు సంబంధించిన జీఎల్‌ఐ, జీపీఎఫ్ కూడా తాను వాడేస్తున్నాడు.రాష్ట్రంలో ఇదీ పరిస్థితి. ఆర్థిక విధ్వంసం అంటే ఇదీ.
రాష్ట్ర సంపద అమ్మేస్తున్నారు:
సొంత వనరులు పెరిగేలా, ఆదాయాలు పెరిగేలా.. పోర్టు బేస్‌డ్ ఇండస్ట్రియలైజేషన్ దిశగా.. మా ప్రభుత్వ హయాంలో ఏకంగా నాలుగు పోర్టుల నిర్మాణం చేపట్టాం.
మూలపేట, మచిలీపట్నం, రామాయపట్నం ఈ మూడు ప్రభుత్వ రంగంలో కట్టడం మొదలుపెట్టి. వాటిలో రామాయపట్నం పనులు దాదాపు 75 శాతం పూర్తి చేశాం. ఎన్నికల కోడ్ రాకుండా ఉండి ఉంటే, మా హయాంలోనే మొదటి షిప్ కూడా వచ్చేది.
మూలపేట, మచిలీపట్నం పోర్టుల పనులు కూడా చాలా వేగంగా జరిగాయి. దాదాపు 40 శాతం పనులు పూర్తయ్యాయి.
10 ఫిషింగ్ హార్బర్ల పనులు కూడా వేగంగా జరిగాయి. వాటిలో ఒకటి, రెండు మా హయాంలోనే ప్రారంభించాం. ఇంకొకటి ఎన్నికల కోడ్ వల్ల ఆగిపోతే.. దాన్ని ఇటీవల ప్రధాని మోదీ చేతుల మీదుగా వర్చువల్‌గా ప్రారంభించారు.
భవిష్యత్తులో వీటి విలువ కొన్ని లక్షల కోట్లు. కానీ, వాటిని కూడా స్కామ్‌లు చేస్తూ, అమ్మకానికి పెట్టారు.17 కొత్త మెడికల్ కాలేజీలు అమ్మకానికి పెట్టారు. వైయస్సార్‌సీపీ ప్రభుత్వంలో పార్లమెంటు నియోజకవర్గాల వారీగా 17 మెడికల్ కాలేజీల పనులు మొదలు పెట్టి, వచ్చే 5 ఏళ్లలో దేశవ్యాప్తంగా 75 వేల మెడికల్ సీట్లు ఇస్తామని, ఈ ఏడాది 10 వేల సీట్లు ఇస్తామని కేంద్రం చెబుతుంటే, ఒక్క మన రాష్ట్రం మాత్రమే ఆ మెడికల్ సీట్లు వద్దంటూ లేఖ రాసింది.
అంతా స్కామ్‌లమయం:
చంద్రబాబు దృష్టిలో సంపద సృష్టి అంటే.. దానర్థం. తన ఆస్తులు పెంచుకోవడం. తన వారి ఆస్తులు మాత్రం పెంచుకోవడం.ఈరోజు ఇసుక స్కామ్. గతంలో ప్రభుత్వానికి ఏటా రూ.750 కోట్ల ఆదాయం వచ్చేది. ఈరోజు ఒక్క రూపాయి రావడం లేదు. మరోవైపు గతంలో అమ్మిన రేటు కంటే డబుల్ రేటుకు అమ్ముతున్నారు.
అంటే సంపద సృష్టి చంద్రబాబు జేబులో జరుగుతోంది. రాష్ట్ర ఆదాయం ఆవిరై పోతోంది.మద్యం షాప్‌లు ప్రభుత్వం నడిపితే, వాటిని ప్రైవేటువారికి అప్పగించారు. çఆ ప్రక్రియలో ఎన్ని అక్రమాలు చేశారో అందరం చూశాం. లాటరీ విధానంలో షాప్‌లు ఇచ్చినా, వారికి మాత్రమే దక్కేలా చేశారు.
మళ్లీ ఎమ్మెల్యేలు గ్రామాల్లో బెల్ట్ షాప్‌లకు వేలం పాటలు నిర్వహించారు. ఎక్కడా నియంత్రణ లేదు. బెల్టుషాప్‌లో అధిక ధరలకు మద్యం అమ్ముతున్నారు.
ప్రతి నియోజకవర్గంలో పేకాట క్లబ్‌లు. చివరకు మండల, గ్రామ స్థాయిలో కూడా పేకాట క్లబ్‌లు వచ్చాయి.
కాంట్రాక్ట్‌ల్లో మొబిలైజేషన్ విధానం:
అవినీతి ఏ స్థాయిలో జరుగుతోంది అంటే.. కాంట్రాక్టర్లకు పనులిచ్చే కార్యక్రమంలో మొబిలైజేషన్ విధానం తెచ్చారు. గతంలో అది లేదు. పనులయ్యాకే బిల్లులు ఇచ్చేవారు.
ఇప్పుడు దాన్ని మార్చి, కాంట్రాక్టర్లు పని చేయకపోయినా ఫరవాలేదు. నీకు అలాట్‌మెంట్లోనే 10 శాతం మొబిలైజేషన్ కింద ఇస్తాం. అందులో 8 శాతం మాకివ్వు. మిగిలింది నీవు తీసుకో అంటున్నారు.
మా హయాంలో జ్యుడీషియల్ ప్రివ్యూ ఉండేది. దాన్ని రద్దు చేశారు. రివర్స్ టెండరింగ్ విధానం ఉండేది. దాన్నీ తీసేశారు.ఇన్ని చేస్తున్న తమను ఎవరైనా ప్రశ్నిస్తే, అణిచి వేయడానికి రెడ్‌బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నారు. ఎవరైనా అడిగితే దారుణంగా వేధిస్తున్నారు.
చీటింగ్‌లో చంద్రబాబు పీహెచ్‌డీ:
చీటింగ్‌లో పీహెచ్‌డీ తీసుకున్న వ్యక్తి చంద్రబాబు. ఆయన నటన ఎలా ఉంటుంది అంటే.. తానిచ్చిన హామీలు తానే ఎగరగొడతాడు. మళ్లీ చాలా బాధగా ఉంది. ఆవేదనగా ఉందని, రాష్ట్రం క్లిష్ట పరిస్థితిలో ఉందని, భయం వేస్తుందని కూడా అంటాడు. రాష్ట్రం ధ్వంసం అయిపోయిందని కూడా అంటాడు.
ఇవన్నీ కాక, ఆ అనేటప్పుడు ఆ చేతులు ఊపడం, మాట్లాడడం.. దానవీర శూర కర్ణ.. ఎన్టీఆర్ సినిమా మీరు చూసి ఉంటారు. ఆయనకు కాదు, నటనలో అవార్డు ఇవ్వాల్సింది. చంద్రబాబుగారికి నటనలో అవార్డు ఇస్తే బాగుంటుంది.
స్లో పాయిజన్‌లా..
ఇవన్నీ ఎన్నికల ముందు చెప్పాను. చంద్రబాబును నమ్మడమంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని చెప్పాను. పులి నోట్ల తల పెట్టినట్లే అని చెప్పాను. అయినా ప్రజలు పొరపాటు పడ్డారు.
చంద్రబాబుగారు ప్రజలను వంచించే కార్యక్రమం, మోసం చేసే కార్యక్రమం.. ఒక పద్ధతి ప్రకారం స్లోగా పాయిజన్ ఎక్కిస్తుంటాడు. తన అబద్ధాల ఫ్యాక్టరీ నుంచి ఒక అబద్ధం తీస్తాడు. దాన్ని ఎల్లో మీడియా రకరకాల పద్ధతుల్లో పబ్లిసిటీ ఇస్తారు.చంద్రబాబు తప్పేమీ లేదని, రాష్ట్ర పరిస్థితి బాగాలేదు కాబట్టి, ఆయన ఏమీ ఇవ్వలేకపోతున్నారని బిల్డప్ ఇస్తారు.
కాగ్ రిపోర్ట్‌పైనా వక్రీకరణ:
క్యాపిటల్ ఎక్స్‌పెండీచర్. 2014–19 మధ్య సగటు మూల ధన వ్యయం రూ.13,860 కోట్లు కాగా, మా హయాంలో 2019–24 మధ్య అది రూ.15,632 కోట్లు.ఇంకా మూలధన వ్యయంలో సోషల్ సర్వీసెస్ కింద చేసిన ఖర్చును ఒకే ఏడాది చూపిస్తూ.. 2018–19లో తాము అందు కోసం రూ.2,866 కోట్లు ఖర్చు చేస్తే.. మా ప్రభుత్వ హయాంలో 2022–23లో అది కేవలం రూ.447 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని చెబుతూ..తన హయాంలో ఎంతో ఖర్చు చేసినట్లు ప్రచారం చేశాడు.నిజానికి చంద్రబాబు హయాంలో 2014–19 మధ్య సగటు ఆ వ్యయం రూ.2437 కోట్లు కాగా, మా హయాంలో అది సగటు వ్యయం అక్షరాలా రూ.5224 కోట్లు.
ఎవరి హయాంలో వాస్తవ అభివృద్ధి?:
చంద్రబాబు హయాంలో 2014–19 మధ్య దేశ జీడీపీలో రాష్ట్ర వాటా 4.47 శాతం కాగా.. వైయస్సార్‌సీపీ హయాంలో అది 4.80 శాతం.
చంద్రబాబు దిగి పోయే నాటికి, 2018–19లో రాష్ట్ర తలసరి ఆదాయంలో మనం దేశంలో 18వ స్థానంలో ఉంటే.. అదే మేము దిగిపోయే నాటికి తలసరి ఆదాయంలో 15వ స్థానానికి ఎదిగాం.
2019–24 మధ్య మన ప్రభుత్వ హయాంలో దేశంతోనే పోటీ పడ్డాం. మన ప్రభుత్వం ఉన్న హయాంలో దేశ జీడీపీ పురోగతి 9.34 శాతం అయితే, రాష్ట్ర జీడీపీ 10.23 శాతం చొప్పున పెరిగింది.పారిశ్రామిక రంగం జీవీఏ. అంటే పారిశ్రామిక రంగం ఉత్పత్తుల విలువ మొత్తం చూస్తే.. చంద్రబాబు దిగిపోయే నాటికి మన రాష్ట్రం 11వ స్థానంలో ఉంటే, మా హయాంలో 9వ స్థానానికి ఎదిగాం.
చంద్రబాబు హయాంలో ఆర్థిక విధ్వంసం:
చంద్రబాబు ఇటీవల డెట్ సస్టెయినబిలిటీ గురించి వక్రీకరించి చెప్పాడు. రాష్ట్ర ఆదాయం కన్నా, చెల్లించాల్సిన వడ్డీ ఎక్కువగా ఉంటే, అది డెట్ సస్టెయినబిలిటీ కాదు.. అని చెప్పాడు. అది వాస్తవం కాదు.
2014–19 మధ్య చంద్రబాబు హయాంలో చూస్తే.. కేంద్రం కట్టిన వడ్డీల వృది రేటు 9.26 శాతం అయితే, కేంద్ర సీఏజీఆర్ జీడీపీలో 10.97 శాతం.
అదే చంద్రబాబు హయాంలో రాష్ట్ర పరిస్థితి చూస్తే.. కట్టాల్సిన వడ్డీల వృద్ధి రేటు 15.43 శాతం కాగా, రాష్ట్ర జీఎస్‌డీపీ గ్రోత్‌రేట్ 13.46 శాతం.
అంటే చంద్రబాబు చెప్పిన థియరీ ప్రకారం.. ఆయన దిగిపోయే నాటికే ఆర్థిక పరిస్థితి దారుణం. ప్రభుత్వం కట్టాల్సిన వడ్డీ రేటు, జీఎస్‌డీపీలో సీఏజీఆర్ ఎక్కువ ఉంది. కానీ, ఆయన దాన్ని దాచి పెట్టాడు.
అదే మన ప్రభుత్వంలో దేశ పరిస్థితి గమనిస్తే.. వడ్డీలకు సంబంధించి వృద్ధి రేటు సీఏజీఆర్ 12.80 శాతం అయితే, దేశ జీడీపీలో సీఏజీఆర్ 9.34 శాతం మాత్రమే. అంటే దేశం జీరో సస్టెయినబిలిటీలోకి వెళ్లింది.అదే సమయంలో రాష్ట్ర పరిస్థితి చూస్తే.. వడ్డీ చెల్లింపుల వృద్ది రేటు సీఏజీఆర్ చంద్రబాబు హయాంలో 15.43 శాతం ఉంటే, దాంట్లో పురోగతి సాధించి, దాన్ని 13.92 శాతానికి తగ్గించాం. కానీ అది చెప్పడు.
అలాగే ఆ సమయంలో రాష్ట్ర జీడీపీలో సీఏజీఆర్, దేశస్థాయిలో కన్నా ఎక్కువ ఉంది. దేశ జీడీపీలో సీఏజీఆర్ 9.34 శాతం అయితే, రాష్ట్ర జీడీపీలో సీఏజీఆర్ 10.23 శాతం నమోదైంది.మొత్తంగా చూస్తే, చంద్రబాబుగారి హయాంలోనే రాష్ట్రం ఆర్థికంగా వి«ధ్వంసం అయిన మాట వాస్తవం.
అప్పులపై పచ్చి అబద్ధాల ప్రచారం:
చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలు. చేసేవన్నీ మోసాలు. ఎన్నికల ముందు రాష్ట్ర అప్పులపై దారుణంగా దుష్ప్రచారం చేశారు. గవర్నర్ ప్రసంగంలో వేరే ఫిగర్ చూపారు.నవంబరులో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రాష్ట్ర అప్జు కేవలం రూ.6,46,531 కోట్లు అని ప్రకటించారు. అంటే రాష్ట్ర అప్పు అంతే అని, చంద్రబాబు ఒప్పుకోక తప్పలేదు.మరి ఎన్నికల ముందు రాష్ట్ర అప్పు రూ.14 లక్షల కోట్లు అని ప్రచారం చేయడం ధర్మమేనా అని అందరూ అడగాలి. ఆలోచించాలి.
ఇంకా చంద్రబాబు పాలనలో పరిమితికి మించి అప్పు చేశాడు. ఆయన హయాంలో రూ.31,082 కోట్లు పరిమితికి మించి అప్పు చేశాడు. దాని వల్ల మా ప్రభుత్వ హయాంలో రూ.17 వేల కోట్లు కోత పెట్టారు.
ఆదాయం తగ్గినా జీఎస్‌డీపీ పెరుగుతుందా!:
చంద్రబాబు పాలనలో రాష్ట్ర ఆదాయం కూడా తగ్గిపోయింది. మా ప్రభుత్వ హయాంలో 2023–24లో జూన్ నుంచి డిసెంబరు వరకు రాష్ట్ర ఆదాయం రూ.50,804 కోట్లు.అదే చంద్రబాబు హయాంలో 2024–25 జూన్ నుంచి డిసెంబరు వరకు రాష్ట్ర ఆదాయం రూ.50,544 కోట్లు. అంటే ఆదాయం పెరగక పోగా, 0.51 శాతం తగ్గింది.
మరి నెగటివ్ గ్రోత్ ఉన్నప్పుడు జీఎస్‌డీపీ పెరుగుతుందా? కానీ చంద్రబాబు ఏం చేశారు? రాష్ట్ర జీడీపీ 13 శాతం పెరిగిందని నివేదిక ఇచ్చాడు. ఇది ఎక్కడైనా సాధ్యమా?
దావోస్ పర్యటనలపైనా ఆర్భాట అసత్యాలు:
2016లో ఇక్కడికి రక్షణ పరికరాల ప్లాంట్ (లాక్ïహీడ్) వస్తుందని, 2017లో విశాఖకు హైస్పీడ్ రైళ్ల కర్మాగారం, హైబ్రిడ్ క్లౌడ్, సౌదీ ఆరాంకో వస్తుందని అన్నారు. ఆ తర్వాత 2018లో రాష్ట్రానికి 150 సంస్థలు వస్తాయని ప్రచారం చేశారు. ఇంకా రాష్ట్రానికి ఎయిర్‌బస్, అలీబాబా క్లౌడ్ సెంటర్ వస్తున్నాయని చెప్పారు.
2019 జనవరిలో వెళ్లి వచ్చి ఏం చెప్పారు. హ్యాపీగా ఏపీకి జెన్ ప్యాక్ వస్తుందని ప్రచారం చేసుకున్నారు.అంటూ.. (ఈనాడు పత్రికలో వచ్చిన కథనాలు చూపారు).
ఈరోజు చంద్రబాబు మీద నమ్మకం ఎంత సన్నగిల్లింది అంటే, ఈసారి దావోస్ వెళ్లిన చంద్రబాబు, కనీసం ఒక్క ఎంఓయూ కూడా చేసుకోలేక పోయారు.
పెట్టుబడి కోసం జిందాల్ వంటి సంస్థ వస్తే.. ఎవరైనా రెడ్ కార్పెట్ వేసి స్వాగతిస్తారు. కానీ, చంద్రబాబు ఏం చేశారు? భయపెట్టి, కేసులు పెట్టి పారిపోయేలా చేశారు. అదే జిందాల్ సంస్థ మహారాష్ట్రలో పెట్టుబడి కోసం దావోస్‌లో ఎంఓయూ చేసుకున్నారు.మన హయాంలో పెట్టుబడులు వచ్చిన వాటికి, ఇటీవల ప్రధాని మోదీతో ప్రారంభింపచేశారు.
ఏం సాధించలేకపోయారు:
చివరకు అవకాశం ఉన్న చోట కూడా వారు రాష్ట్రానికి ఏం సాధించలేకపోతున్నారు. ఇటీవల కేంద్ర బడ్జెట్‌లో కేవలం 12 మంది ఎంపీలున్న బీహార్, తమ రాష్ట్రానికి ఎన్నో సాధించుకుంది. ఇక్కడ చంద్రబాబుకు 16 మంది ఎంపీలు ఉన్నారు. కేంద్రంలో కూటమిలో ఉన్నా, ఏమీ సాధించలేకపోయారు.
ఆ పని చేయకపోగా, ఉన్న పోలవరం ప్రాజెక్టును కూడా నాశనం చేశారు. ఇది పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి బడ్జెట్ డిమాండ్ కాపీ. దాంట్లో పోలవరం ప్రాజెక్టు ఎత్తును కేవలం 41.15 మీటర్లకే పరిమితం చేశారు. (అంటూ.. ఆ నోట్ చదివి వినిపించారు).
నిధులు కూడా తగ్గించారు. కేవలం రూ.12,157 కోట్లు మాత్రమే ఇస్తామని, ప్రాజెక్టు ఎత్తును కేవలం 41.15 మీటర్లకే అనుమతి ఇస్తామని స్పష్టంగా చెప్పినా, ఒక్క మాట కూడా మాట్లాడలేదు.
మెడికల్ సీట్లు వద్దనడం దారుణం:
దేశవ్యాప్తంగా వచ్చే 5 ఏళ్లలో 75 వేల మెడికల్ సీట్లు, ఈ ఏడాది 10 వేల సీట్లు ఇస్తామని కేంద్రం చెబితే, మనకు మెడికల్ సీట్లు వద్దంటూ చంద్రబాబు లేఖ రాయడం.. ఇంతకన్నా విధ్వంసం ఏమైనా ఉంటుందా?
9 నెలల్లో ఎన్నెన్ని విధ్వంసాలు:
పిల్లలను బడికి పంపేలా అమలు చేసిన అమ్మ ఒడి ఆపేశారు? ఇది విధ్వంసం కాదా? స్కూళ్లలో నాడు–నేడు పనులు ఆపేశారు? ఇది విధ్వంసం కాదా? ఇంగ్లిష్ మీడియమ్‌ను, సీబీఎస్‌ఈనీ, అక్కడి నుంచి ఐబీ దాకా ప్రయాణం. మూడో తరగతి నుంచి టోఫెల్ క్లాస్‌లు తీసేశారు. పిల్లలను ప్రపంచ స్థాయి విద్యకు దూరం చేశారు? ఇది విధ్వంసం కాదా?
8వ తరగతి పిల్లలకు ఏటా ట్యాబ్‌లు ఇస్తే, దాన్ని ఆపేశారు. ఇది విధ్వంసం కాదా?
సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్‌కు గ్రహణం పట్టించారు. ఇది విధ్వంసం కాదా?
పిల్లలను చదువులకు ప్రోత్సహించే వసతి దీవెన రద్దు చేసి, విద్యా దీవెన అరకొరగా అమలు చేయడం విధ్వంసం కాదా?
చంద్రబాబు ఇవ్వాల్సిన పథకాలు ఇవ్వకపోగా, ఉన్న పథకాలు ఎత్తేసి, ప్రజల జీవితాలతో ఆడుతున్నాడు. ఇది విధ్వంసం కాదా?
ఆరోగ్యశ్రీ ఊపిరి తీసేశారు. ఆరోగ్య ఆసరా కనబడకుండా చేశారు. పేదలు అప్పులపాలు కాకుండా వైద్యం చేయించుకోలేని పరిస్థితి తెచ్చారు. ఇది విధ్వంసం కాదా?
రైతు భరోసా నిలిపేసి, వారితో ఆడుకోవడం విధ్వంసం కాదా?
సున్నా వడ్డీ తీసేయడం, ఉచిత క్రాప్ ఇన్సూరెన్స్ పథకం రద్దు చేయడం విధ్వంసం కాదా?
రైతులను నాశనం చేస్తూ, ఆర్బీకే వ్యవస్థను నిర్వీర్యం చేయడం విధ్వంసం కాదా? ఈ–క్రాప్ విధానాన్ని రద్దు చేయడం విధ్వంసం కాదా?
అక్కచెల్లెమ్మలను సైతం.. చేయూత, ఈబీసీ నేస్తం, కాపు నేస్తం, ఆసరా వంటి పథకాలు రద్దు చేయడం, వారిని చేయి పట్టి నడిపించకపోవడం విధ్వంసం కాదా?
పేదలకు తోడుగా ఉంటూ మత్స్యకార భరోసా, వాహనమిత్ర, నేతన్న నేస్తం, చేదోడు, తోడు ఇవన్నీ కూడా నిలిపివేసి, బలహీనవర్గాలకు తీరని ద్రోహం చేయడం విధ్వంసం కాదా?
ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకపోగా, ఉన్న ఉద్యోగాలు ఊడబీకడం, వాలంటీర్లను మోసం చేయడం, ప్రభుత్వ ఉద్యోగులకూ అన్యాయం చేయడం విధ్వంసం కాదా?
రాష్ట్రానికి సంబంధించిన వనరులు రాకుండా చేయడం, రాష్ట్రం ఆదాయం పెంచకుండా తన సొంత జేబు ఆదాయం పెంచుకునేందుకు ఇసుక, మద్యం, మట్టి, క్వారŠడ్జ్ దోచేయడం విధ్వంసం కాదా?
అధికారంలోకి రాగానే ప్రశ్నించే స్వరం ఉండకూడదని, రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేయడం విధ్వంసం కాదా?
మున్సిపల్ ఉప ఎన్నికలు. అప్రజాస్వామిక విధానాలు:
నిన్న తిరుపతి సంఘటన చూస్తే ఇది అన్నింటి కంటే విధ్వంసం.తిరుపతి కార్పొరేషన్‌లో వైయస్‌ఆర్‌సీపీకి 48 స్థానాలు ప్రజలు ఇచ్చారు. టీడీపీకి ఒక్క స్థానం ప్రజలు ఇచ్చారు. ఇవాళ మీరు చేసింది ఏంటి?
డిప్యూటీ మేయర్ ఉప ఎన్నికలో వైయస్‌ఆర్‌సీపీ కార్పొరేటర్లను బెదిరించి, ప్రలోభపెట్టి, పోలీసుల ఎదుటే కిడ్నాప్ చేసి ఓటు హక్కు ఉన్న ఎమ్మెల్సీని సైతం కిడ్నాప్ చేశారు. చివరకు వాళ్లే డిప్యూటీ మేయర్ గెలిచినట్లు డిక్లైర్ చేసుకున్నారు.
ఏలూరు కార్పొరేషన్‌లో వైయస్‌ఆర్‌సీపీ 47 స్థానాలు ఉన్నాయి. హిందూపురం మున్సిపాలిటీలో చంద్రబాబు బావమరిది ఎమ్మెల్యేగా ఉన్న చోట ఛైర్మన్‌గా టీడీపీ గెల్చినట్లు డిక్లేర్ చేసుకున్నారు.
మా హయాంలో అలా చేయలేదు:
వైయస్సార్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు మొత్తం మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ మొత్తం స్వీప్ చేసింది. కేవలం రెండు చోట్ల మాత్రం టీడీపీ గెలిచింది. తాడిపత్రి, దర్శిలో మున్సిపాలిటీల్లో గెలిచింది.
తాడిపత్రిలో 38 స్థానాల్లో మా పార్టీ 18, టీడీపీ 20 స్థానాలు గెల్చుకుంది. మేము కావాలనుకుంటే ఛైర్మన్ పదవి దక్కించుకునే వాళ్లం. కానీ మేము ఆ పని చేయలేదు. టీడీపీకి తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ పదవి దక్కింది.అంటూ.. (ఆ సందర్భంగా అప్పటి టీడీపీ ఇంఛార్జ్ ఏమన్నాడో చూడమని వీడియో చూపారు).
హ్యాట్సాఫ్ టు జగన్ అని టీడీపీ ఇన్‌చార్జ్ జగన్‌ను ఉద్దేశించి అన్నాడు. దట్ ఈజ్ కాల్డ్ గవర్నెన్స్. ప్రజాస్వామ్యంలో ప్రజలకు రక్షణగా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వానిది.
అలాంటి ప్రభుత్వం ఎలా ప్రవర్తిస్తుందన్నది చాలా ముఖ్యమైన అంశం.అధికార బలం ఉందని ఇష్టమొచ్చినట్లుగా ప్రతీది నాకే కావాలని దోచేయడం.. మనది కాని పదవులు కూడా మనకు రావాలని ఆశపడడం తప్పు.ఈ పెద్ద మనిషి చంద్రబాబుకు బుద్ధి, జ్ఞానం రెండూ లేవు కాబట్టి.. రాష్ట్రంలో ఈ మాదిరిగా పరిపాలన చేస్తున్నాడు కాబట్టే.. అధ్వాన్నమైన పరిస్థితులు నెలకొంటున్నాయి.