Ys Jagan : కోటరీకి జగన్ బ్రేక్.. ఇకపై ముఖాముఖి భేటీలే..!
అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వం ఇప్పడిప్పుడే బయటపడుతున్నట్లు కనిపిస్తోంది.

అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ(Ysrcp) అగ్ర నాయకత్వం ఇప్పడిప్పుడే బయటపడుతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం(TDP)- జనసేన(JSP)- భారతీయ జనతా పార్టీ (BJP)సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై పోరుకు సై అంటోంది. మరోవైపు పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడంపై దృష్టి పెట్టింది. కార్యకర్తలు, ప్రజలతో మమేకం కావడానికి ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్(Ys jagan) ప్రాధాన్యత ఇస్తోన్నారు. బూత్ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయడానికి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పని చేస్తోన్న నాయకులు, కార్యకర్తలతో బూత్ కమిటీలను భర్తీ చేయనున్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను జనంలోకి తీసుకెళ్లే సామర్థ్యం ఉన్న వారికి కీలక పదవులు ఇవ్వనున్నారని తెలుస్తోంది.
కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందంటూ.. వాటి అమలు కోసం పోరాడేలా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకున్నారు. విద్యుత్ ఛార్జీల భారం, ధాన్యం సేకరణలో విఫలం కావడం, సేకరిస్తోన్న ధాన్యానికి కనీస మద్దతు ధర ఇవ్వడం లేదని ప్రతిపక్ష పార్టీ ఆరోపిస్తోంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తాన్ని విడుదల చేయకపోవడం వల్ల రాష్ట్రంలో విద్యార్థులు, తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందులు, ఆరోగ్యశ్రీ పథకం సక్రమంగా అమలు కాకపోవడం వల్ల పేద కుటుంబాలు ఎదుర్కొంటోన్న సమస్యలపై మరిన్ని పోరాటాలు చేసేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రజాసమ్యసలపై ప్రజాదర్బార్ ఏర్పాటు చేయనున్నారు జగన్. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజా దర్బార్ ( Praja Darbar)జరుగనుంది. ప్రస్తుతం ఈ ప్రజా దర్బార్- ఆయన సొంత నియోజకవర్గం పులివెందులకు మాత్రమే పరిమితమైన విషయం తెలిసిందే. పులివెందుల పర్యటనకు వెళ్లిన ప్రతీసారీ ఇడుపులపాయలో ప్రజా దర్బార్‌ను నిర్వహిస్తోన్నారు. నియోజకవర్గం, జిల్లా ప్రజలను కలుసుకుంటోన్నారు. రాయలసీమ నాయకులో భేటీ అవుతోన్నారు. ఇప్పుడు దీన్ని తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి తరలివచ్చే వారిని నేరుగా కలుసుకోనున్నారు. కూటమి ప్రభుత్వంపై వారి నుంచి ఫిర్యాదులను స్వీకరించనున్నారు. ఎలాంటి అపాయింట్‌మెంట్లు లేకుండా, కోటరీ జోక్యం అవసరం లేకుండా ముఖాయుఖి సమావేశం కానున్నారు.
