TDP And YSRCP : ఒకే వేదికపై టీడీపీ, వైసీపీ ప్రజాప్రతినిధులు.. నవ్వుతూ ఫోటోలకు ఫోజులిచ్చారు..!
టీడీపీ(TDP), వైసీపీ(YCP) ఇరు పార్టీల నాయకులకు మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. ఈ నేపథ్యంలో ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. టీడీపీ ఎంపీ(MP), వైసీపీ ఎమ్మెల్యే(MLA) ఇద్దరూ ఓ చోట కలుసుకున్నారు. అంతేకాదు ఆత్మీయంగా పలుకరించుకున్నారు. నవ్వుతూ ఫోటోలకు ఫోజులిచ్చారు.
టీడీపీ(TDP), వైసీపీ(YCP) ఇరు పార్టీల నాయకులకు మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. ఈ నేపథ్యంలో ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. టీడీపీ ఎంపీ(MP), వైసీపీ ఎమ్మెల్యే(MLA) ఇద్దరూ ఓ చోట కలుసుకున్నారు. అంతేకాదు ఆత్మీయంగా పలుకరించుకున్నారు. నవ్వుతూ ఫోటోలకు ఫోజులిచ్చారు. ఆ ఇద్దరు నేతలు ఎవరో కాదు.. టీడీపీ ఎంపీ కేశినేని నాని(Kesineni Nani), మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్(Vasanth Krishna Prasad). మైలవరంలో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో రూ.30 లక్షల ఎంపీ నిధులతో నిర్మించిన ప్రహరీ గోడను ఎంపీ కేశినేని నానితో కలసి ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆరుదైన సంఘటన చోటుచేసుకుంది.
పార్టీలు వేరైనా ప్రజాప్రతినిధులుగా ప్రజలకు అత్యుత్తమ సేవలందించడమే మా లక్ష్యమని ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ అన్నారు. ఈ సందర్భంగా మైలవరం నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించిన ఎంపీ నానికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే.. రెడ్డిగూడెం మండలం నాగులూరులో కమిటీ హాల్ నిమిత్తం రూ.50 లక్షలు, నియోజకవర్గంలో మరో నాలుగు కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలకు రూ.1.05 కోట్లు, మైలవరంలో ప్రహరిగోడకు రూ.30 లక్షలు, కొండపల్లిలో బొమ్మల కళాకారుల కోసం భవనాల నిర్మాణాలకు రూ.1 కోటి మంజూరు చేశారని అన్నారు.
పార్టీలు వేరైనా, మా ఇరు పార్టీల సిద్ధాంతాలు వేరైనా, మా పార్టీ విధి విధానాల ప్రకారం తాము నడుచుకుంటామన్నారు. కానీ అభివృద్ధిలో మాత్రం ప్రజాప్రతినిధులుగా కలసి మెలసి ఐకమత్యంతో మైలవరం నియోజకవర్గ ప్రజలకు సేవలు అందిస్తామన్నారు. కోవిడ్ సమయంలో నిధులు కొరతగా ఉన్నప్పటికీ ఎంపీ నాని మైలవరం నియోజకవర్గ అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తూ నిధులు కేటాయించారని పేర్కొన్నారు.
ఎంపీ కేశినేని నాని మనస్తత్వం, నా మనస్తత్వం ఒకటే అన్నారు. ఉన్నది బహిరంగంగా చెబుతామన్నారు. లోపల ఒకటి, బయట ఒకటి మాట్లాడే వ్యక్తిత్వం మాది కాదన్నారు. ప్రజలకు ఉపయోగపడే పనుల్లో మా ఇద్దరి మాట, ఇద్దరి బాట ఒకటే అన్నారు. కానీ పార్టీల పరంగా ఎవరి విధానాలు వారివే అన్నారు.
రాజకీయాల కోసం వ్యక్తిగతమైన ద్వేషాలు పెట్టుకుని, బంధుత్వాలు వదులుకుని, ఒకరికొకరు దూరంగా ఉండటం మంచి పద్ధతి కాదని, ఇది తన వ్యక్తిగత విన్నపం అని అన్నారు. ఎవరి పార్టీలను వారు నమ్ముకుంటూ, ఆయా పార్టీల సిద్దాంతాల ప్రకారం ముందుకు వెళ్తూనే వ్యక్తిగత ద్వేషాలు విడనాడాలని పిలుపునిచ్చారు.