Duvvada Srinivas : దువ్వాడను వైసీపీ తొలగించుకుంటుందా?
దువ్వాడను వైసీపీ తొలగించుకుంటుందా?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ(YCP) ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ను(MLC Duvvada Srinivas) మీడియా ఇప్పట్లో వదిలేలా లేదు. దువ్వాడ ఎపిసోడ్‌ను టీఆర్‌పీల కోసం తెగ వాడేసుకుంటున్నాయి ఛానెళ్లు. టీవీ సీరియళ్లకు మించిన ట్విస్టులు ఉన్నాయి కాబట్టే రోజూ కొంత సమయాన్ని దువ్వాడ ఫ్యామిలీ మ్యాటర్‌కు కేటాయిస్తున్నాయి న్యూస్ ఛానెళ్లు. ఆయన వ్యక్తిగత జీవితంలోకి చొరబడటం మంచిది కాదన్న సోయి లేకుండా ఓ సెక్షన్ ఆఫ్ మీడియా అదే పనిగా అదే చూపిస్తోంది. దువ్వాడకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముడిపెట్టి చేయాల్సిదంతా చేస్తున్నారు. సహజంగానే ఇది వైసీపీకి కాసింత ఇబ్బంది కలిగిస్తోంది. దువ్వాడ శ్రీనివాస్ భార్య, కూతుళ్లు తమకు న్యాయం జరగాలంటూ రోడ్డెక్కారు. ఇది నైతిక విలువలకు సంబంధించిన విషయం కాబట్టి ప్రజలు దువ్వాడ ఎపిసోడ్‌పై ఆసక్తి పెంచుకుంటున్నారు. జనాలకు ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అన్నది అనవసరం. దువ్వాడ లైఫ్‌లో మరో మహిళ ఎంటరయ్యారన్నదే వారికి కావాలి. అందుకే సోషల్ మీడియాలో(Social media) దువ్వాడ బాగా ట్రోల్ అవుతున్నారు. ఇది పార్టీకి నష్టం కలిగిస్తుందేమోనని అధిష్టానం కలవరపడుతోంది. ఒక నాయకుడి కోసం పార్టీని బలిపెట్టడం మంచిది కాదేమోనన్న భావనకు వచ్చింది. దువ్వాడను పార్టీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయమని అధిష్టానం ఆదేశించిందనే వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దువ్వాడను వైసీపీ వదిలించుకుంటే పరిస్థితి ఎలా ఉంటుంది? ఆయన బలమైన సామాజికవర్గానికి చెందిన వారు. పైగా నోరు కూడా ఎక్కువే. పార్టీ నుంచి ఆయనను తొలగిస్తే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడకుండా ఉండరు కదా! ఆ భయంతోనే వైసీపీ మీనమేషాలు లెక్కపెడుతున్నదని కొందరు అంటున్నారు.