ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (EVM) పనితీరుపై అనేకానేక సందేహాలు వస్తున్నాయి.

ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (EVM) పనితీరుపై అనేకానేక సందేహాలు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఈవీఎంలపై పెద్ద చర్చే నడుస్తోంది. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో అయితే రోజురోజుకీ అనుమానాలు ఎక్కువవుతున్నాయి. ఎన్నికల్లో ఏదో జరిగే ఉంటుందనే సందేహం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ(YCP) వారికే కాదు, తటస్థులకు కూడా వస్తున్నది. పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు చాలా వ్యత్యాసం ఉందని, ఇది ఎలా సాధ్యమని కొందరు ప్రశ్నిస్తున్నారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నేతల్లో కొందరు ఈవీఎంపై ప్రశ్నలు సంధించారు. ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగిన బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి(Balineni srinivas reddy) వెలిబుచ్చిన అనుమానాలు సహేతుకమైనవే! ఓడిపోవడం కంటే తమకు బలం ఉన్న చోట తెలుగుదేశంపార్టీకి మెజారిటీ రావడమేటిన్నది ఆయన సంధించిన ప్రశ్న. 12 పోలింగ్‌ బూత్‌లపై అనుమానం వ్యక్తం చేస్తూ వాటిలో లెక్కింపు చేపట్టాలని కోరుతూ ఎన్నికల సంఘానికి 5.66 లక్షల రూపాయలు చెల్లించారు కూడా! లెక్కించడానికి ఈసీకి వచ్చిన కష్టమేమిటో తెలియదు. తాము మాక్‌ పోలింగ్‌ మాత్రమే నిర్వహిస్తామని చెప్పడంతో ఈసీ తీరు ఈవీఎంలలో ఏదో జరిగిందనే అనుమానాన్ని పెంచేట్టుగా ఉండింది. వీవీ ప్యాట్లను లెక్కిస్తే సరిపోయేది కదా! అందరి సందేహాలు తీరేవి కదా! కానీ ఈసీ అలా చేయడం లేదు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి చవి చూసిన తర్వాత వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధినేత జగన్మోహన్‌రెడ్డి(YS Jagan) ఎక్స్‌ (ట్విట్టర్‌) ద్వారా స్పందించారు.

'న్యాయం జరగడమే కాకుండా జరిగేలా చూడాలి. అదేవిధంగా, ప్రజాస్వామ్యం బలంగా ఉండటమే కాకుండా సందేహాస్పదంగా కనిపించాలి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు ప్రతి అభివృద్ధి చెందిన ప్రజాస్వామ్య దేశంలో, పేపర్ బ్యాలెట్‌లను ఉపయోగించి ఎన్నికలు నిర్వహిస్తారు. మన ప్రజాస్వామ్యం యొక్క నిజమైన స్ఫూర్తిని నిలబెట్టడానికి మనం కూడా అదే దిశలో వెళ్లాలి' అని రాసుకొచ్చారు. ఆ తర్వాత ఎన్నికల సంఘంపై ఒక్క మాట కూడా అనలేదు. కనీసం ఈవీఎంలపై న్యాయపోరాటం చేస్తున్న తన పార్టీ నాయకులకు కూడా అండగా ఉండటం లేదు. ఈవీఎంలపైనా, ఎన్నికల సంఘంపైనా ఒక్క మాట కూడా అనడం లేదు. మౌనంగా ఉంటున్నారు. జగన్‌ ఎందుకు సైలెంటయ్యారు? ఈవీఎంలలో ఏదో జరిగిందే అనుకుందాం! ఆ విషయం బట్టబయలు అయ్యిందే అనుకుందాం! అప్పుడు బీజేపీ అప్రతిష్ట పాలవుతుంది. దొంగదారిన గద్దెనెక్కిందనే అపప్రదను ఎదుర్కోవాల్సి రావచ్చు. దేశ ప్రజల దృష్టిలో చులకయ్యే ప్రమాదం కూడా ఉంది. అందుకే కేంద్రంలోని బీజేపీ అధినాయకత్వం నుంచి జగన్‌కు ఏమైనా ఆదేశాలు అందాయా? ఈవీఎంల జోలికి వెళ్లకూడదని జగన్‌కు బీజేపీ పెద్దలు చెప్పారా? బీజేపీ మాటను ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్‌ కాదనలేరు. అందుకే ఈవీఎంపై జగన్‌ పల్లెత్తు మాట కూడా అనడం లేదని వైసీపీ నేతలు చెబుతున్నారు.

Eha Tv

Eha Tv

Next Story