గత కొన్ని నెలలుగా వర్షం లేకుండా తీవ్ర ఉక్కపోత ఎదుర్కొన్న ఏపీ ప్రజలకు
గత కొన్ని నెలలుగా వర్షం లేకుండా తీవ్ర ఉక్కపోత ఎదుర్కొన్న ఏపీ ప్రజలకు వరుణుడు కాస్త ఊరటను ఇస్తున్నాడు. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీలో నేడు వర్షాలు పడనున్నాయి. కాకినాడ, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, విజయనగరం, కృష్ణా, పార్వతీపురం, ఏలూరు, అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, విశాఖ, కోనసీమ, అనకాపల్లి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్నిచోట్ల పిడుగులు కూడా పడే అవకాశముంది. సత్యసాయి, ప్రకాశం, పల్నాడు, అనంతపురం, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందని, పిడుగులు కూడా పడొచ్చని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శనివారం నాడు కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో 28.2 మిల్లీమీటర్లు, తిరుపతి జిల్లా పుత్తూరులో 27.2, కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో 14 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
రాబోయే రోజుల్లో అనేక రాష్ట్రాలు కూడా మండుతున్న వేడి నుండి ఉపశమనం పొందే అవకాశం ఉంది. భారత వాతావరణ శాఖ (IMD) తాజా అంచనాల ప్రకారం, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల్లో రాబోయే మూడు రోజుల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉంది. భారతదేశంలోని అనేక ప్రాంతాలలో ఉరుములతో కూడిన వర్షాల కారణంగా, హీట్ వేవ్ తగ్గిపోయిందని.. రాబోయే మూడు రోజులు చల్లటి వాతావరణం ఉంటుందని IMD తెలిపింది.