Rain In AndhraPradesh: తెలుగు రాష్ట్రాల్లో నేడు వర్షాలు.. పోలింగ్ పై ప్రభావం చూపేనా?
ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్లే ఓటర్లు స్థానిక వాతావరణాన్ని బట్టి తగిన జాగ్రత్తలు
ఆంధ్రప్రదేశ్ లో నేడు కొన్ని ప్రాంతాల్లో ఎండలు, మరికొన్ని చోట్ల వర్షాలు పడుతున్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ నేపథ్యంలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్లే ఓటర్లు స్థానిక వాతావరణాన్ని బట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల సంస్థ అధికారులు సూచించారు. నేడు అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నంద్యాల, కర్నూలు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందని పేర్కొంది.
తెలంగాణ రాష్ట్రంలో ఇంకొన్ని రోజుల పాటూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఆదివారం తెలిపింది. దీనికి సంబంధించి ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. మధ్యప్రదేశ్, మరఠ్వాడా, ఇంటీరియర్ కర్నాటక, తమిళనాడు మీదుగా కొమొరిన్ వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతున్నదని, దాని ప్రభావంతోనే వర్షాలు పడతాయని తెలిపింది. రాష్ట్రంలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, పిడుగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది.