Vijayanagaram : జనం ఎందుకింత బండగా మారిపోయారు? ప్రాణం పోతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదు?
మనిషన్నవాడు మాయమయ్యాడు. మానవత్వం(Humanity) కొంచెం కూడా మిగలకుండా పోతున్నది.
మనిషన్నవాడు మాయమయ్యాడు. మానవత్వం(Humanity) కొంచెం కూడా మిగలకుండా పోతున్నది. యువకుడు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న జనం పట్టనట్టుగా వెళ్లిపోయారు. పాపం కొడుకు ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఆ తల్లి ఎంతగా తల్లడిల్లుతున్నా ఎవరికీ కనికరం కలగలేదు. ఆసుపత్రికితీసుకెళదాం. కాసింత సాయం చేయండి అంటూ రోదిస్తున్నా బండ గుండెలు కరగలేదు. సెల్‌ఫోన్‌లలో ఫోటోలు, వీడియోలు తీసుకోడానికి చూపించిన ఉబలాటం ప్రాణాలతో విలవిలలాడుతున్న ఆ యువకుడిని రక్షించడానికి చూపించలేదు. హాస్పిటల్‌కు తీసుకెళ్లాలన్న సోయి ఎవరికీ కలగలేదు. ఫలితంగా 108 అంబులెన్స్ వచ్చేసరికే ఆ యువకుడు చనిపోయాడు. ఈ విషాద ఘటన విజయనగరంలోని(Vijayanagar) వైఎస్‌ఆర్ కూడలి(YSR Kudali) దగ్గర జరిగింది. రైల్వేస్టేషన్ ప్రాంతానికి చెందిన 30 ఏళ్ల కె.గంగధారరావుతల్లి గోవిందమ్మతో కలిసి ఆటోలో వెళుతూ.. గూడ్స్ షెడ్డు వంతెన దగ్గరి పని ఉందని దిగాడు. ఆటో దిగాడో లేదో ఓ ట్రాక్టర్ అతడిని ఢీకొట్టింది. తీవ్రగాయాలతో అక్కడే పడిపోయాడు. ఆటోలోంచి అది చూసిన తల్లి గోవిందమ్మ పరుగుపరుగున వచ్చి కొడుకును లేపడానికి ప్రయత్నించింది. ఆసుపత్రికి తీసుకెళదామంటూ అక్కడున్నవారిని వేడుకుంది. బతిమాలింది. అయినా ఎవరూ ముందుకు రాలేదు. ఎవరూ సాయం చేయలేదు. కిలోమీటరు దూరంలోనే మహారాజా ప్రభుత్వ ఆసుపత్రి ఉన్నప్పటికీ ఎవరూ సాయం చేయలేదు. ప్రమాదం 12.45 గంటలకు జరిగితే అంబులెన్స్ 1.15కు వచ్చింది. అప్పటికే ఆ యువకుడు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.