Vasamsetti Subash : మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వాసంశెట్టి సుభాష్.. తొలి సంతకం ఆ ఫైల్ మీదే..
వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో గురువారం ఉదయం 7.50 గంటల సమయంలో రాష్ట్ర కార్మిక, ప్యాక్టరీలు, బాయిలర్స్ మరియు ఇన్సూరెన్సు మెడికల్ సర్వీసెస్ శాఖ మంత్రిగా వాసంశెట్టి సుభాష్ బాధ్యతలు చేపట్టారు.
వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో గురువారం ఉదయం 7.50 గంటల సమయంలో రాష్ట్ర కార్మిక, ప్యాక్టరీలు, బాయిలర్స్ మరియు ఇన్సూరెన్సు మెడికల్ సర్వీసెస్ శాఖ మంత్రిగా వాసంశెట్టి సుభాష్ బాధ్యతలు చేపట్టారు. అమరావతి సచివాలయం ఐదో బ్లాక్ మొదటి అంతస్తులో ఆయనకు కేటాయించిన ఛాంబరులో వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఎంతో ఘనంగా రాష్ట్ర మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. మంత్రిగా భాద్యతలు చేపట్టేందుకు సతీసమేతంగా రాష్ట్ర సచివాలయానికి విచ్చేసిన ఆయనకు వేదపండితులు పూర్ణకుంభంతోను అధికారులు పుష్పగుచ్ఛాలతోను ఘనంగా స్వాగతం పలికారు. పండితుల వేదమంత్రాల మధ్య శాస్త్రోత్తంగా ఆ భగవంతునికి శోడషోపచార పూజలు జరిపిన తదుపరి తన సీటులో కూర్చున్నారు. రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే గత ప్రభుత్వ హయాంలో అమల్లోవున్న వైయస్సార్ భీమా పథకం పేరును చంద్రన్న బీమా పథకంగా మార్చే ఫైల్ పై తొలి సంతకం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చంద్రన్న పాలలోనే కార్మికుల హక్కుల పరిరక్షణ, వారి సంక్షేమం అనేది సాధ్యమవుతుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం అనుసరించిన ఇసుక పాలసీ విధానం వల్ల నిర్మాణ రంగం కుధేలు అయిందని, ఫలితంగా భవన నిర్మాణ కార్మికులకు పనుల్లేక ఎన్నో సమస్యలను ఎదుర్కోవడం జరిగిందన్నారు. కార్మికుల సంక్షేమం విషయంలో గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించిందన్నారు. నవరత్నాల పథకాలు అమలు పేరుతో కార్మికుల సంక్షేమానికి సంబంధించిన 13 రకాల పథకాల అమలును గత ప్రభుత్వం నిలుపుదల చేసిందన్నారు.
కార్మిక శాఖకు సెస్ రూపేణా వచ్చిన రూ.3,000 కోట్లను పూర్తిగా పక్కదారి పట్టించడం జరిగిందన్నారు. కార్మిక భీమా పథకం కింద గతంలో చంద్రబాబు హయాంలో రూ.2.55 కోట్ల భీమా సొమ్మును చెల్లిస్తే.. గత ప్రభుత్వ హయాంలో కేవలం రూ.1.25 కోట్లను మాత్రమే చెల్లించడం జరిగిందని వివరించారు. రాష్ట్రంలో విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి, విజయవాడలలో వున్న ఈఎస్ఐ ఆసుపత్రులను గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, 238 పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉన్నా భర్తీ చేయకుండా ఈఎస్ఐ ఆసుపత్రులను గాలికి వదిలేసిందని విమర్శించారు.
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన విషయంలో కూడా గత ప్రభుత్వం పూర్తిగా అశ్రద్ధ వహించిందని, బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించేందుకు తమ ప్రభుత్వం గట్టిగా కృషి చేస్తుందని ఆయన అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిచంద్రబాబు తనపై ఉన్న గట్టి నమ్మకంతో కార్మిక శాఖ మంత్రి బాధ్యతలు తనకు అప్పగించారని, వారి నమ్మకం ఏమాత్రం ఒమ్ముకాకుండా కార్మికుల సంక్షేమానికి, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలను శాయశక్తులా కృషిచేస్తానని ఆయన అన్నారు.