US Visa Center to Open in Andhra Pradesh:విజయవాడలో కానీ, విశాఖలో కానీ అమెరికా వీసా కేంద్రం!
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హైదరాబాద్ యూఎస్ కాన్సులేట్ అధికారులు ఓ తీపి వార్త చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హైదరాబాద్ యూఎస్ కాన్సులేట్ అధికారులు ఓ తీపి వార్త చెప్పారు. విశాఖపట్నం లేదా విజయవాడలో వీసా అప్లికేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని అమెరికా పరిశీలిస్తోందని చెప్పింది. వీలైనంత ఎక్కువ మంది భారతీయులు అమెరికాలో చదువుకోడానికి, అక్కడ ఉండటానికి వీలుగా వీసాలు మంజూరు చేస్తున్నామని యుఎస్ కౌన్సెలర్ జనరల్ రెబెకా డ్రామే తెలిపారు. అమెరికా వీసా ప్రక్రియను విద్యార్థుల ఆకాంక్షలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు క్రమబద్ధీకరిస్తున్నామని రెబెకా వివరించారు.
అమెరికాలో 2023-24లో 3.3 లక్షల మంది భారతీయ విద్యార్థులు ఉంటే.. అందులో 56 శాతం విద్యార్థులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారేనని ఆమె తెలిపారు. ఈ 56 శాతం విద్యార్థులలో తెలంగాణ నుంచి 34 శాతం విద్యార్థులు అమెరికాకు వస్తే, ఆంధ్రప్రదేశ్ నుంచి 22 శాతం విద్యార్థులు అమెరికాకు వచ్చారని వివరించారు. హైదరాబాద్‌లో ఈ సమ్మర్ సీజన్‌లో 47 వేలకు పైగా విద్యార్థి వీసాలకు ఇంటర్వ్యూలు నిర్వహించినట్లు చెప్పారు. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతాతో పోలిస్తే హైదరాబాద్ కాన్సుల్ జనరల్‌లో నాన్‌ఇమిగ్రెంట్ వీసాలు ఎక్కువగా జారీ చేస్తున్నట్లు రెబెకా డ్రామే తెలిపారు. ప్రస్తుతం రోజుకు 1,600 వీసాలు మంజూరు చేస్తున్నామని.. ఆ సంఖ్యను 2025 ఫిబ్రవరి నాటికి 2,500కు పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు.