Shrivani Trust Members : శ్రీవాణి నిధులతో వెనుకబడిన ప్రాంతాల్లో టీటీడీ ఆలయాల నిర్మాణంపై పీఠాధిపతుల ప్రశంస
సనాతన హిందూ ధర్మప్రచారంలో భాగంగా గిరిజన(Tribal), ఎస్సీ(SC), మత్స్యకార(Fisherman) , ఇతర వెనుకబడిన గ్రామాల్లో శ్రీవాణి ట్రస్టు నిధులతో టీటీడీ ఆలయాల నిర్మాణం(TTD Temple Construction), పురాతన ఆలయాల పునరుద్ధరణ చేయడం అభినందనీయమని పలువురు పీఠాధిపతులు, మఠాధిపతులు ప్రశంసించారు.
సనాతన హిందూ ధర్మప్రచారంలో భాగంగా గిరిజన(Tribal), ఎస్సీ(SC), మత్స్యకార(Fisherman) , ఇతర వెనుకబడిన గ్రామాల్లో శ్రీవాణి ట్రస్టు నిధులతో టీటీడీ ఆలయాల నిర్మాణం(TTD Temple Construction), పురాతన ఆలయాల పునరుద్ధరణ చేయడం అభినందనీయమని పలువురు పీఠాధిపతులు, మఠాధిపతులు ప్రశంసించారు. టీటీడీ ధర్మప్రచారం కోసం ఏర్పాటుచేసిన శ్రీవాణి ట్రస్టుపై(Shrivani Trust) రాజకీయ ప్రయోజనాల కోసం దుష్ప్రచారం చేయకండని విశ్వహిందూ పరిషత్ సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్(Vishwa Hindu Parishad Central Governing Council) సభ్యులు రాఘవులు హెచ్చరించారు. తిరుమల అన్నమయ్య భవనంలో గురువారం టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డితో(Evo AV Dharma Reddy) కలిసి మీడియా సమావేశం నిర్వహించి శ్రీవాణి ట్రస్టుపై కొందరు చేస్తున్న ఆరోపణలను ఖండించారు.
ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ.. సనాతన ధర్మంలో కీలకమైన దేవాలయం సమాజ సంక్షేమ కేంద్రమని చెప్పారు. పురాతన కాలంలో ఆలయం ధర్మశాల, వేదశాల, భోజనశాల, యోగశాల, వైద్యశాల, మల్లశాల, గోశాలగా ఏడు ప్రధాన బాధ్యతలను నిర్వహించేదని తెలిపారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ధార్మిక సంస్థ టీటీడీపై నిరాధారమైన ఆరోపణలు చేయడం వల్ల కోట్లాది మంది భక్తుల మనోభావాలు, విశ్వాసం దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. తాము శ్రీవాణి ట్రస్టు అకౌంట్లను పరిశీలించామని, ఒక్క పైసా కూడా దుర్వినియోగమయ్యే అవకాశం లేదని చెప్పారు. ఎవరికైనా సందేహాలుంటే నేరుగా తిరుమలకు వచ్చి శ్రీవాణి ట్రస్టు రికార్డులను, అకౌంట్లను పరిశీలించి నివృత్తి చేసుకోవచ్చని తెలియజేశారు.
అదేవిధంగా, శ్రీనివాసమంగాపురంలోని లలితా పీఠాధిపతి శ్రీ స్వస్వరూపానందగిరి స్వామి, కడపలోని బ్రహ్మంగారి మఠం మఠాధిపతి శ్రీ విరజానందస్వామి, హైదరాబాదుకు చెందిన శ్రీ హనుమత్ పీఠం పీఠాధిపతి శ్రీ దుర్గాప్రసాద స్వామి మాట్లాడుతూ.. శ్రీవాణి నిధులు దుర్వినియోగం అవుతున్నాయని వస్తున్న ఆరోపణలపై వాస్తవాలు తెలుసుకునేందుకు తిరుమలలో ఈవోను కలిశామన్నారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా ఎంతమంది దర్శించుకున్నారు, ఎక్కడెక్కడ ఆలయాలు నిర్మాణం జరుగుతోంది, ట్రస్టు నిధులు ఏయే బ్యాంకుల్లో ఉన్నాయి, వడ్డీ ఎంత వచ్చింది తదితర వివరాలను ఈవో తెలియజేశారని చెప్పారు. ఈ వివరాలు పరిశీలించాక తమకు ఎంతో సంతోషం కలిగిందని, నిధులు దుర్వినియోగమయ్యే అవకాశమే లేదని తెలిపారు. వాస్తవాలు తెలుసుకోకుండా ఆరోపణలు చేస్తే హిందూ ధర్మం పట్ల భక్తుల విశ్వాసం సన్నగిల్లే ప్రమాదం ఉందన్నారు.
హైదరాబాదుకు చెందిన సోలిస్ ఐకేర్ ఎండీ రామాంజనేయులు(Solis Eyecare MD Ramanjaneyul).. మాట్లాడుతూ నాలుగు దశాబ్దాలుగా సామాన్య భక్తుడిగా తిరుమల శ్రీవారిని దర్శించుకుంటున్నానని, శ్రీవాణి ద్వారా కూడా పలుమార్లు దర్శనానికి వెళ్లానని చెప్పారు. శ్రీవాణి ట్రస్టు అకౌంట్లను పరిశీలించాక తనకు ఉన్న సందేహాలన్నీ తొలగిపోయాయని, భక్తులు ఇస్తున్న విరాళాలతో వెనుకబడిన ప్రాంతాల్లో ఆలయాల నిర్మాణం జరుగుతోందని వివరించారు.
టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి మాట్లాడుతూ.. శ్రీవాణి ట్రస్టు నిధుల వినియోగంపై భక్తులకు ఎవరికైనా సందేహాలుంటే నేరుగా టీటీడీని సంప్రదించి వివరాలు పొందవచ్చన్నారు. నిరాధారమైన ఆరోపణలను నమ్మవద్దని భక్తులకు విజ్ఞప్తి చేశారు. నాలుగేళ్లలో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానంలో 8.25 లక్షల మంది శ్రీవాణి ట్రస్టు ద్వారా స్వామివారిని దర్శించుకున్నారని చెప్పారు. ఎన్నో నియమ నిబంధనల ప్రకారం ట్రస్టు ఏర్పాటు అవుతుందని, ఇంతమంది భక్తులకు రసీదులు ఇవ్వకపోతే మిన్నకుంటారా అని ప్రశ్నించారు. విరాళానికి, దర్శన టికెట్‌కు వేరువేరుగా రసీదులు వస్తాయని చెప్పారు. ఆరోపణలు చేసే ముందు వాస్తవాలను పూర్తిగా తెలుసుకోవాలని, లేనిపక్షంలో కోట్లాది మంది భక్తులు విశ్వాసం దెబ్బతింటుందని అన్నారు.