Artha Brahmotsavam : అర్ధ బ్రహ్మోత్సవానికి టీటీడీ విస్తృత ఏర్పాట్లు...రథసప్తమి రోజున ఏడు వాహనాలపై శ్రీ మలయప్ప కటాక్షం
శుక్రవారం జరిగే రథసప్తమి వేడుకలను(Rathasaptami) ఘనంగా నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) విస్తృత ఏర్పాట్లు చేసింది. ఒకేరోజు స్వామివారు ఏడు వాహనాలపై భక్తులకు దర్శనమిస్తారు. దీనిని అర్థ బ్రహ్మోత్సవం(Artha Brahmotsavam) అని అంటారు. ఒకరోజు బ్రహ్మోత్సవం అని కూడా పిలుస్తారు.

Artha Brahmotsavam
శుక్రవారం జరిగే రథసప్తమి వేడుకలను(Rathasaptami) ఘనంగా నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) విస్తృత ఏర్పాట్లు చేసింది. ఒకేరోజు స్వామివారు ఏడు వాహనాలపై భక్తులకు దర్శనమిస్తారు. దీనిని అర్థ బ్రహ్మోత్సవం(Artha Brahmotsavam) అని అంటారు. ఒకరోజు బ్రహ్మోత్సవం అని కూడా పిలుస్తారు. భక్తులు ఎండకు ఇబ్బందులు పడకుండా అఖిలాండం దగ్గర, మాడ వీధుల్లో అవసరమైన ప్రాంతాల్లో షెడ్లు ఏర్పాటు చేశారు. మాడ వీధుల్లో కూల్ పెయింట్ వేశారు. ఆకట్టుకునేలా రంగవల్లులు తీర్చిదిద్దారు. గ్యాలరీల్లో వేచి ఉన్న భక్తులకు నిరంతరాయంగా సాంబారన్నం, పెరుగన్నం, పులిహోర, పొంగలి తదితర అన్నప్రసాదాలు అందించనున్నారు. అదే విధంగా తాగునీరు, మజ్జిగ, టి, కాఫీ, పాలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫిబ్రవరి 16న ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే బ్రేక్ దర్శనం ఉంటుంది.
వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాలు రద్దు చేశారు. సామాన్య భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఫిబ్రవరి 15వ తేదీ నుంచి 17వ తేదీ వరకు తిరుపతిలోని కౌంటర్లలో సర్వదర్శనం టోకెన్ల జారీ ఉండదు. భక్తులు నేరుగా వైకుంఠం క్యూకాంప్లెక్స్-2 ద్వారా శ్రీవారిని దర్శించుకోవచ్చు. కాగా, 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులు నిర్దేశించిన టైం స్లాట్లను పాటించని పక్షంలో టోకెన్ లేని భక్తులతో కలిపి వైకుఠం క్యూ కాంప్లెక్స్-2 ద్వారా దర్శనానికి పంపుతారు.
శ్రీ మలయప్పస్వామివారు ఉదయం 5.30 గంటల నుంచి 8 గంటల వరకు సూర్యప్రభ, ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు చిన్నశేష, ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు గరుడ వాహనంపై, మధ్యాహ్నం ఒంటిగంట నుండి రెండు గంటల వరకు హనుమంత వాహనాలపై భక్తులకు దర్శనమిస్తారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి 3 గంటల వరకు పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం 4 గంటల నుంచి గంటల వరకు కల్పవృక్ష, సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు సర్వభూపాల, రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనాలపై భక్తులను కటాక్షిస్తారు. వాహనసేవలను ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. ఇదిలా ఉంటే, రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. సుప్రభాతం, తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు.
