TTD Officals Suggestion : శ్రీవారి నడకదారిలో వీరు వెళ్లకపోవడమే మంచిది..!
తిరుమల(Tirumala) శ్రీ వేంకటేశ్వరస్వామిని(Venkateswara Swamy) దర్శించుకోవడానికి రోజూ వేలాది మంది భక్తులు(devotees) వస్తుంటారు.
తిరుమల(Tirumala) శ్రీ వేంకటేశ్వరస్వామిని(Venkateswara Swamy) దర్శించుకోవడానికి రోజూ వేలాది మంది భక్తులు(devotees) వస్తుంటారు. తిరుమలకు కాలి నడకన వెళ్లే వారు కూడా పెద్ద సంఖ్యలో ఉంటారు. ఆ విధంగా మొక్కు చెల్లించుకుంటారు. అయితే నడక మార్గంలో(Alipiri steps) వెళ్లడం అనుకున్నంత సులభం కాదు. ఈ మధ్యన నడక మార్గంలో జరుగుతోన్న ఘటనలను దృష్టిలో పెట్టుకుని తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు కొన్ని సూచనలు చేసింది. 60 ఏళ్లు దాటినవారు, మధుమేహం, అధిక రక్తపోటు, ఉబ్బసం, మూర్ఛ, కీళ్ల వ్యాధులు ఉన్న వారు కాలినడకన రావడం శ్రేయస్కరం కాదని హితవు చెప్పింది. అలాగే ఊబకాయంతో బాధపడుతున్న వారు, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు నడక మార్గాన్ని ఎంచుకోవడం మంచిది కాదనంటున్నారు టీటీడీ అధికారులు(TTD Officials). తిరుమల కొండ సముద్ర మట్టానికి చాలా ఎత్తులో ఉండటం వల్ల ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉంటుందని, కాలినడకన రావడం చాలా ఒత్తిడితో కూడుకున్నదని, కాబట్టి గుండె సంబంధిత వ్యాధులు, ఉబ్బస వ్యాధిని తీవ్రతరం చేసే అవకాశం ఉంది కాబట్టి భక్తులు తదనగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న భక్తులు వారి రోజువారి మందులు వెంట తెచ్చుకోవడం ద్వారా సమస్యలను నివారించవచ్చునని సలహా ఇస్తున్నారు.
కాలినడకన వచ్చే భక్తులకు ఏమైనా సమస్యలు ఎదురైతే అలిపిరి కాలిబాట మార్గంలోని 1500 మెట్టు, గాలి గోపురం, భాష్యకార్ల సన్నిధి వద్ద వైద్య సహాయం పొందవచ్చని తెలిపారు. తిరుమలలోని ఆశ్వినీ ఆసుపత్రి, ఇతర వైద్యశాలల్లో 24×7 వైద్య సదుపాయం పొందవచ్చని, దీర్ఘకాలిక కిడ్ని వ్యాధిగ్రస్తులకు అత్యవసర పరిస్థితుల్లో తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో డయాలసిస్ సౌకర్యం అందుబాటులో ఉందని తెలిపారు.