TTD Cancelled Sarva Darshan Tickets : తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు.. రేపు సర్వ దర్శనం టోకెన్లు రద్దు
వైకుంఠ ఏకాదశి(Vaikunta Ekadasi)కోసం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి(Tirumala Sri Venkateswara Swam) ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. డిసెంబర్ 23వ తేదీ నుంచి జనవరి 1వ తేదీ వరకు భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనం కల్పించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేస్తున్నది.

TTD Cancelled Sarva Darshan Tickets
వైకుంఠ ఏకాదశి(Vaikunta Ekadasi)కోసం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి(Tirumala Sri Venkateswara Swam) ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. డిసెంబర్ 23వ తేదీ నుంచి జనవరి 1వ తేదీ వరకు భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనం కల్పించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేస్తున్నది. ఈ సందర్భంగా డిసెంబర్ 23వ తేదీన వైకుంఠ ఏకాదశి, 24వ తేదీన వైకుంఠ ద్వాదశి పండుగల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. డిసెంబరు 22వ తేదీన అదే రోజు శ్రీవారి దర్శనానికి సంబంధించి తిరుపతిలో మంజూరు చేసే సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్లను టీటీడీ రద్దు చేసింది. భక్తులు తిరుమలలో వైకుంఠం క్యూకాంప్లెక్స్ ద్వారా సర్వదర్శనంలో ఆ రోజు శ్రీవారిని దర్శించుకోవచ్చు. డిసెంబరు 22వ తేదీ మధ్యాహ్నం రెండు గంటల నుండి తిరుపతిలోని తొమ్మిది ప్రాంతాల్లో వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ మొదలవుతుంది. టోకెన్లు పూర్తయ్యే వరకు నిరంతరాయంగా టోకెన్ల జారీ జరుగుతుంది. డిసెంబరు 23వ తేదీన వైకుంఠ ఏకాదశి రోజున ఉదయం 9 గంటల నుండి 10 గంటల మధ్య శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు స్వర్ణరథంపై ఆలయ నాలుగు మాడ వీధులలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ సందర్భంగా తిరుమల నాదనీరాజనం వేదికపై మధ్యాహ్నం 12 గంటల నుంచి భగవద్గీతలోని 18 అధ్యాయాలలో ఉన్న 700 శ్లోకాలతో అఖండ పారాయణం చేస్తారు. సాయంత్రం ఆరు గంటల నుంచి విష్ణు సహస్రనామా పారాయణం చేస్తారు. డిసెంబరు 24న వైకుంఠ ద్వాదశిని పురస్కరించుకుని తెల్లవారుజామున 4.30 గంటల నుండి 5.30 గంటల వరకు శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్ల చక్రస్నాన మహోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ రోజును స్వామి పుష్కరిణి తీర్థ ముక్కోటి అని కూడా పిలుస్తారు. డిసెంబరు 22వ తేదీ నుంచి 24వ తేదీ వరకు, డిసెంబరు 31వ తేదీ, జనవరి 1వ తేదీల్లో శ్రీవారి ఆలయంలో కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలను టీటీడీ రద్దు చేసింది. సహస్ర దీపాలంకార సేవను కూడా ఏకాంతంగా నిర్వహిస్తారు.ఈ పది రోజుల పాటు ఇతర ఆర్జిత సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు. ఇంతకు ముందులాగే ఈ ఏడాది కూడా స్వయంగా వచ్చే ప్రోటోకాల్ వీఐపీలకు, కుటుంబ సభ్యులకు పరిమిత సంఖ్యలో మాత్రమే బ్రేక్ దర్శనం ఇస్తారు. ఈ పది రోజుల పాటు ఎలాంటి సిఫారసు లేఖలను స్వీకరించరు.
