ఐసీసీ వన్డే క్రికెట్ ప్రపంచ కప్-2023 ప్రారంభమైన నేపథ్యంలో క్రికెట్ బెట్టింగ్ రాయుళ్లు క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ అమాయక ప్రజలను, యువకులను లక్ష్యంగా చేసుకొని,
ఐసీసీ వన్డే క్రికెట్ ప్రపంచ కప్(World Cup)-2023 ప్రారంభమైన నేపథ్యంలో క్రికెట్ బెట్టింగ్ రాయుళ్లు క్రికెట్ బెట్టింగ్(Cricket Betting) నిర్వహిస్తూ అమాయక ప్రజలను, యువకులను లక్ష్యంగా చేసుకొని, అనతి కాలంలోనే ఎక్కువగా డబ్బు సంపాదించవచ్చని ఆశలు రేకెత్తించేలా అమాయకులను ప్రేరేపించి మోసం చేయాలని ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకునేది లేదని జిల్లా ఎస్పీ పరమేశ్వర రెడ్డి(Parameshwar Reddy) బెట్టింగ్ రాయుళ్లను హెచ్చరించారు.
జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తూ, అనుమానిత ప్రాంతాలపై ఆకస్మిక దాడులు నిర్వహిస్తూ నిఘా పెంచడం జరిగిందన్నారు. తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చనే ఆశ చూపించి అమాయక ప్రజల బలహీనతలను ఆసరాగా చేసుకుని క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడినా, నిర్వహించినా, ప్రోత్సహించినా ఉపేక్షించబోమన్నారు. AP జూద చట్టం-1974(చట్ట సవరణ 2020) ప్రకారం కేసులు నమోదు చేయడమే కాకుండా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, సస్పెక్ట్ షీట్లు ఓపెన్ చేసి వారి కదలికలపై నిరంతర నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.
తిరుపతి జిల్లాలో ఎక్కడైనా క్రికెట్ బెట్టింగ్ జరుగుతున్నట్లు ప్రజలకు తెలిస్తే సదరు సమాచారాన్ని DIAL 100 కు సమాచారమివ్వాలని జిల్లా ఎస్పి విజ్ఞప్తి చేశారు. సమాచారమిచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని భరోసానిచ్చారు. తాను శ్రమించకుండా వచ్చే నగదు వెనుక అనేక కష్టాలు, నష్టాలు దాగి ఉంటాయని యువత గుర్తెరగాలని, అనవసరంగా కేసుల్లో నిందితులుగా మారి జీవితాలను నాశనం చేసుకోవద్దని, తమ తల్లిదండ్రుల కోసం తమ ఆశయాల సాధన కోసం ఉన్నతంగా బ్రతకాలని ఆకాంక్షించారు. బెట్టింగ్ రాయుళ్ళ వలలో పడకుండా అప్రమత్తంగా ఉండాలని అలాగే క్రికెట్ బెట్టింగ్ నిర్వహించాలని చూస్తే ఎంతటి వారినైనా వదిలి పెట్టే ప్రసక్తే లేదని ఎస్పీ పరమేశ్వర రెడ్డి జిల్లా యువతకు సూచించారు.