Tirumala Darshan And Events: తిరుమలకు వెళుతున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి!!
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి
తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం సాయంత్రం నృసింహ జయంతి ఘనంగా జరిగింది. ప్రతి ఏటా వైశాఖ మాసంలో ఈ ఉత్సవం నిర్వహిస్తారు. శ్రీ యోగనరసింహస్వామివారి మూలమూర్తికి ఈ సందర్భంగా ప్రత్యేక అభిషేకం చేశారు. శ్రీవారి ఆలయ మొదటి ప్రాకారంలో గర్భాలయానికి ఈశాన్యం వైపున గల మండపంలో పడమరగా శ్రీ యోగ నరసింహస్వామివారి ఉప ఆలయం ఉంది. యోగముద్రలో ఉన్న ఈ విగ్రహాన్ని శాస్త్ర ప్రకారం రూపొందించారు. స్వామివారికి నాలుగు చేతులుంటాయి. పైభాగంలో ఉన్న చేతులలో శంఖుచక్రాలు కనిపిస్తాయి. కింది రెండు చేతులు ధ్యాననిష్టను సూచిస్తాయి. క్రీ.శ 1330 నుంచి క్రీ.శ 1360 మధ్య కాలంలో నిర్మితమైన ఈ ఆలయంలో శ్రీ రామానుజాచార్యుల వారు శ్రీ యోగ నరసింహస్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇక్కడి స్వామివారు సగభాగం మానవ రూపంలోనూ, మరో సగభాగం శ్రీవారి అవతారమైన సింహం రూపంలోనూ ఉంటారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం పడుతూ ఉంది. ఉచిత సర్వ దర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. బుధవారం నాడు 80,048 మంది స్వామి వారిని దర్శించుకోగా.. 35,403 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ 4.17 కోట్లు అని టీటీడీ తెలిపింది.
తాళ్లపాక అన్నమాచార్యులవారి 616వ జయంతి ఉత్సవాలు మే 23 నుండి 29వ తేదీ వరకు అన్నమయ్య జన్మస్థలమైన తాళ్లపాకలోని ధ్యానమందిరం, 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద, తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో జరుగనున్నాయి. ఇందులో భాగంగా మే 23వ తేదీన తాళ్లపాకలోని ధ్యానమందిరం వద్ద ఉదయం 10.30 గంటలకు శ్రీవారి కల్యాణం నిర్వహిస్తారు.
తాళ్లపాకలో.. మే 23 నుండి 25వ తేదీ వరకు సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు తాళ్లపాకలోని ధ్యానమందిరం వద్ద, 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద భక్తి సంగీత, నృత్య కార్యక్రమాలు నిర్వహిస్తారు. తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో మే 24 నుండి 29వ తేదీ వరకు ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 1.00 గంట వరకు సాహితీ సదస్సులు నిర్వహిస్తారు. మే 23 నుండి 29వ తేదీ వరకు ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రముఖ కళాకారులతో సంగీత, నృత్య కార్యక్రమాలు నిర్వహించనున్నారు.