CEO Mukesh Kumar Meena : రాత్రి 8 నుంచి 9 గంటలకు పూర్తి ఫలితాలు
జూన్ 4న ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ప్రధాన ఏర్పాట్లు అన్నీ పూర్తి చేయడం జరిగిందని సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ కు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు.

The complete election results will be declared between 8 and 9 pm
జూన్ 4న ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ప్రధాన ఏర్పాట్లు అన్నీ పూర్తి చేయడం జరిగిందని సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్(Nitin Vyas) కు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా(CEO Mukesh Kumar Meena) స్పష్టం చేశారు. బుధవారం న్యూ ఢిల్లీ నిర్వచన్ సదన్ నుండి సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు కు నియోజక వర్గాల నుంచి వారీగా చేస్తున్న ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా మాట్లాడుతూ.. ఓట్ల లెక్కింపుకు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని, సత్వరమే ఫలితాల ప్రకటనకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
రాష్ట్రంలోని మొత్తం 175 శాసన సభా నియోజకవర్గాల్లో 111 నియోజక వర్గాల్లో 20 రౌండ్ల లోపు, 61 నియోజకవర్గాల్లో 21 నుండి 24 రౌండ్ల లోపు.. మిగిలిన మూడు నియోజకవర్గాల్లో 25 రౌండ్లకు పైబడి ఓట్ల లెక్కింపు కార్యక్రమం కొనసాగేలా ప్రణాళిక సిద్దం చేసుకోవడం జరిగిందన్నారు.
111 నియోజక వర్గాల్లో మద్యాహ్నం 2.00 గంటల్లోపు, 61 నియోజక వర్గాల్లో సాయంత్రం 4.00 గంటల్లోపు.. మిగిలిన 3 నియోజక వర్గాల్లో సాయంత్రం 6.00 గంటల్లోపు ఓట్ల లెక్కింపు పూర్తి అవుతుందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తంచేశారు. పోస్టల్ బ్యాలెట్ ల లెక్కింపుకై టేబుళ్లను పెంచి సకాలంలో వాటి లెక్కింపును కూడా పూర్తి చేయడం జరుగుతుందన్నారు. ఏది ఏమైనా రాత్రి 8–9 గంటల మద్య అన్ని నియోజక వర్గాల తుది ఫలితాలు ప్రకటించే విధంగా ప్రణాళికా బద్దంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు.
ఎన్నికల తదుపరి కొన్ని జిల్లాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడం ఎంతో దురదృష్టకరమని, ఓట్ల లెక్కింపు రోజు ఆయా జిల్లాలో ఎటు వంటి అవాంచనీయ సంఘటనలకు తావు లేకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేయడం జరుగుచున్నదని, 144 సెక్షన్ అమలుతో పాటు సీనియర్ అధికారులను నియమించడం జరిగిందన్నారు. పల్నాడు జిల్లాలో డిజీపీతో పాటు తాను స్వయంగా పర్యటించి అక్కడి పరిస్థితులను పరిశీలించడం జరిగిందని, అధికారులతో సమీక్షి నిర్వహించి వారిని అప్రమత్తం చేయడం జరిగిందని తెలిపారు.
