Revanth Reddy : 15న విశాఖలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. పదేళ్ల తర్వాత అధికారం దక్కడంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా ఉత్సాహంతో ఐకమత్యంగా పనిచేస్తున్నారు.
తెలంగాణ(Telangana)లో కాంగ్రెస్(Congress) అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. పదేళ్ల తర్వాత అధికారం దక్కడంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా ఉత్సాహంతో ఐకమత్యంగా పనిచేస్తున్నారు. ఇచ్చిన ఎన్నికల హామీలను సీఎం రేవంత్ రెడ్డి(CM revanth Reddy) స్పీడుగానే అమలుచేస్తున్నారు. అయితే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన కృషి మాటల్లో చెప్పలేం. అప్పటి అధికార బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్, కీలక నేత హరీష్ రావుల దూకుడుకు రేవంత్ ఒక్కరే సమాధానమయ్యారు. 70కి పైగా సభలలో పాల్గొని అందరి విమర్శలకు బదులిస్తూ.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చారు.
రేవంత్ రెడ్డి ఆ స్పీడు పార్టీకి ఎంతో ఉపయోగపడిందని అధిష్టానం భావిస్తోంది. దీంతో ఇదే స్ట్రాటజీని కాంగ్రెస్ పార్టీ ఏపీలోనూ ఉపయోగించా లనుకుంటోంది. పార్టీకి పూర్వ వైభవాన్ని తెచ్చే దిశగా వ్యూహాలు రూపొందిస్తోంది. అందుకు అనుగుణంగానే దివంగత కాంగ్రెస్ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిలకు పగ్గాలు అప్పగించింది. అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పీడును, సేవలను ఏపీలోనూ వాడుకోవాలని చూస్తోంది. ఈ నేపధ్యంలోనే రేవంత్ ముఖ్య అతిధిగా ఏపీలో బహిరంగ సభకు ప్లాన్ చేసింది. ఈ నెల 15న విశాఖపట్నంలో కాంగ్రెస్ భారీ బహిరంగ నిర్వహించ బోతున్నట్లు పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఈ సభకు ముఖ్య అతిథిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతారని పేర్కొంది.