TDP MLA Kolikapudi: సొంత పార్టీ ప్రభుత్వంపై కొలికపూడి తిరుగుబాటు..!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్‌రావు వ్యవహారశైలి చర్చనీయాంశంగా మారింది. గత రెండు రోజులుగా తిరువూరు నియోజకవర్గంలో బెల్ట్‌షాపులను ఆయన మూసివేయిస్తున్నారు. స్వయంగా కొలికపూడి వైన్ షాపుల వద్దకే వెళ్లి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయన్న కారణంతో నాలుగు వైన్సులను మూసివేయించారు. అలాగే బెల్ట్‌షాపులను 48 గంటల్లో తొలగించాలని ఆయన అల్టిమేటం జారీ చేశారు. అంతేకాకుండా ఉదయం 10 గంటలకే మందు తాగేందుకు వచ్చిన వ్యక్తులను మందలించారు కూడా. అంతటితో కొలికపూడి ఆగలేదు. తాజాగా తన ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, బీజేపీ చీఫ్ పురంధేశ్వరి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కలిసి ఇది మంచి ప్రభుత్వం అనే పోస్టర్‌ను ఆవిష్కరించే ఫొటోతో పాటు కీలక కామెంట్స్ కూడా ఆయన షేర్ చేయడంపై చర్చ జరుగుతోంది. ఇందులో “తిరువూరు పట్టణంలో వినాయకుడి గుడి ఎదురుగా , ఇంజనీరింగ్ కాలేజ్ గేటు ఎదురుగా , మహిళా ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు సృష్టిస్తున్న బస్టాండ్ వద్ద ఉన్న మధిర రోడ్డులో జనవాసాల మధ్య …మద్యం దుకాణాలన్నింటిని దయచేసి ఊరి బయట పెట్టుకోమని ప్రార్థన” అంటూ ఆయన పోస్టు పెట్టారు. ఇది మంచి ప్రభుత్వం అని పోస్టర్ విడుదల చేసిన ఫొటోను పెట్టడంపై ఇప్పుడు అంతా చర్చించుకుంటున్నారు.