హిందూపురం(Hindupuram), పెనుకొండ, మడకశిర నియోజకవర్గాలలో ఇసుక దందా జోరుగా సాగుతోంది.

హిందూపురం(Hindupuram), పెనుకొండ, మడకశిర నియోజకవర్గాలలో ఇసుక దందా జోరుగా సాగుతోంది. ఇసుక(Sand) మాఫియా నదులు, కుంటలు, వాగులు, వంకలు దేన్నీ వదలిపెట్టడం లేదు. నిమిషంపాటు కూడా విరామం లేకుండా అదే పనిగా ట్రాక్టర్లు, టిప్పర్లతో ఇసుకను తరలిస్తూ జేబులు నింపుకుంటున్నారు. చంద్రబాబు(Chandrababu) నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఇసుకాసురులు రెచ్చిపోతున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగం చోద్యం చూస్తోంది. చిన్నాచితకా నేతల దగ్గర్నుంచి బడా నేతల వరకు ఇదే పని! మడకశిర నియోజకవర్గం విషయానికి వస్తే ఇసుక అక్రమ రవాణా అడ్డూ అదుపూ లేకుండా సాగుతోంది. మడకశిర, అమరాపురం, గుడిబండ, రొళ్ల మండలాలో వాగులు, వంకలలోని ఇసుకను ఇష్టానుసారంగా తవ్వుకుంటున్నారు. అగళి మండలంలోని సువర్ణముకి నది కేంద్రంగా ప్రతి రోజూ వందల కొద్దీ ట్రాక్టర్ల ఇసుకను అక్రమంగా తవ్వుకుంటున్నారు. ఈ దందాను నిలువరించాల్సిన పోలీసు, రెవెన్యూ, సెబ్‌ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు. గట్టిగానే పని చేస్తున్నామని చెప్పుకోవడానికి మూడు నెలల్లో ఓ ఆరు ట్రాక్టర్లను సీజ్‌ చేశారు అధికారులు. ఇసుకను పూర్తిగా తవ్వేస్తుండటంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. రైతుల వ్యవసాయబోర్లు ఎండిపోయాయి. ఇసుకాసురులకు అధికార పార్టీ నాయకుల అండదండలు ఉన్నాయని స్థానికులు అంటున్నారు. హిందూపురంలోనూ ఇదే పరిస్థితి. హిందూపురానికి రోజుకు 500 ట్రాక్టర్ల ఇసుక అవసరం అవుతుంది. అయితే ఎక్కడా ఇసుక రీచ్‌ లేకపోవడంతో అధికారపార్టీ వారు ఇసుక మాఫియాగా మారారు. హిందూపురం సమీపంలోనే పెన్నా, జయమంగళి, చిలమత్తూరు మండలంలో కుషాతి, చిత్రావతి నదులు ఉన్నప్పటికీ ఇక్కడ మాత్రం ఇసుక రీచ్‌లు లేవు. దూరం నుంచి ఇసుక తెచ్చుకోవడానికి టన్నుకు 5 వేల రూపాయలకు పైగా అవుతుంది. అందుకే అందుబాటులో ఉన్న ట్రాక్టర్ల వారితో ఇసుక తోలించుకుంటున్నారు. లేపాక్షి, చిలమత్తూరు పరిధిలోని వాగులు, వంకలు నుంచి ఇసుకను తరలిస్తున్నారు. పెనుగొండ నియోజకవర్గంలో కూడా ఇసుక మాఫియా రెచ్చిపోతున్నది. పరిగి మండలం శ్రీరంగరాజుపల్లి, మల్లమోతుకపల్లి, కాలువపల్లి, పరిఇ, నేతలపల్లి, శాసనకోట, శీగిపల్లి, గణపతిపల్లి, పైడేటి, ఊటుకూరు, బోరెడ్డిపల్లి ప్రాంతాలలో ఇసుకను ఇష్టానుసారంగా తవ్వుకుంటున్నారు. రొద్దం మడలంలో పెద్దమంతూరు, రొప్పాల, కుర్లపల్లి, కొత్తపల్లితో పాటు పెనుకొండలోని శెట్టిపల్లి, గోరంట్ల మండలం చిత్రావతి నదీ పరివాహక ప్రాంతాల నుంచి ఇసుకను అక్రమంగా తవ్వుతున్నారు. పోలీసుల దాడులలో పట్టుబడినప్పటికీ ట్రాక్టర్లను సీజ్‌ చేసేలోపుగానే మంత్రి సవిత మనుషులమంటూ తప్పించుకుంటున్నారు. చిత్రమేమిటంటే ఇసుక రవాణాకు చెక్‌ పెట్టాల్సిన పోలీసులే ఇసుక దందాకు తెరలేపడం. భీమ్‌రావ్‌ భారత్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు నాగరాజు ఇసుక అక్రమరవాణాను నిలువరించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇసుక రవాణాను ఆపకుంటే భవిష్యత్తులో తాగడానికి నీరు కూడా దొరకదని చెబుతున్నారు. ఈ మేరకు ఆయన నేషనల్ గ్రీన్‌ ట్రిబ్యునల్‌లో కంప్లయింట్ కూడా చేశారు.



Updated On 11 Oct 2024 1:31 PM GMT
Eha Tv

Eha Tv

Next Story