TTD Funds Use : రోడ్లకు టీటీడీ నిధులు ...విస్మయం కలిగిస్తున్న టీడీపీ సర్కారు ఆదేశాలు
విస్మయం కలిగిస్తున్న టీడీపీ సర్కారు ఆదేశాలు
రాజకీయ పార్టీలకు మాట మీద నిలబడటం అలవాటు లేదు. ఆ జబ్బు ప్రతీ పార్టీకి ఉంది. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు మరోలా మాట్లాడటం రివాజు. శ్రీవారి భక్తుల సౌకర్యార్థం నాటి వైఎస్‌ఆర్ కాంగ్రెస్(YCP) ప్రభుత్వం తిరుపతి నగరంలో తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో రోడ్లు నిర్మిస్తే అప్పుడు విపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నానా యాగి చేసింది. గగ్గోలు పెట్టింది. అధికారంలోకి రాగానే విజిలెన్స్ విచారణ పేరుతో టీటీడీ ఇంజనీర్లకు నోటీసులు జారీ చేసింది. ఇక ఇప్పుడు టీటీడీ నిధులతోనే(TTD Funds) చంద్రగిరి(Chandragiri) నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణం కోసం ఈవోకు ఆదేశాలు జారీ చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. ఇంతకు మించిన ఆత్మవంచన మరోటి ఉంటుందా? తిరుపతిలో భక్తుల కోసం అప్పటి టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి సహకారంతో 18 మాస్టర్ ప్లాన్ రోడ్లు నిర్మించారు. ఇందుకోసం మున్సిపాలిటీ నిధులతో పాటు టీటీడీ నిధులను కూడా కేటాయించారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ గాయ్‌గత్తర చేసింది. ఇక టీడీపీ(TDP) అనుకూల మీడియా అయితే తిరుమలకు అపచారం జరిగిందన్నట్టుగా బాధపడింది. మాస్టర్ ప్లాన్ రోడ్లపై రోజుకో వ్యతిరేకవార్తను వండి తమ బాస్‌ను సంతోషపెట్టింది. టీడీపీ అధికారంలోకి వచ్చి రాగానే టీటీడీ ప్రక్షాళన పేరుతో 40 మంది విజిలెన్స్ అధికారుల బృందం తిరుమల, తిరుపతిలో తిష్టవేసి ఫైళ్లను స్కాన్‌చేసింది. 75 మంది ఇంజనీర్లకు నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందుకున్న ఇంజనీర్లు ఇంక వివరణ కూడా ఇవ్వలేదు అప్పుడే ప్రభుత్వం నుంచి టీటీడీ ఈవోకు ఓ ఆదేశం వెళ్లింది. చంద్రగిరి నియోజక వర్గంలోని పలు రహదారులను టీటీడీ నిధులతో నిర్మించాలన్నది ఆఆదేశం సారాంశం! దీంతో నిన్ననే నోటీసులు అందుకు టీటీడీ ఇంజనీర్లు బిత్తరపోతున్నారు. ఏ పని చేసినందుకు తమకు నోటీసులు జారీ చేశారో, ఇప్పుడు అదే పని చేయమంటూ ఆదేశాలు ఇవ్వడం ఏమిటి? అని ప్రశ్నిస్తున్నారు.