గాజు గ్లాసును ఫ్రీ సింబల్ గా 2023లో ఈసీ ప్రకటించిన వెంటనే ఆ గుర్తు కోసం మొదటగా దరఖాస్తు చేశానని అంటున్నారు పిటిషనర్

కొద్దిరోజుల కిందట జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గాజు గ్లాసు గుర్తును ఖరారు చేసింది. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి ఈ-మెయిల్ ద్వారా ఉత్తర్వులు పంపించింది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తును కేటాయించవలసిందిగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘానికి కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. గత సార్వత్రిక ఎన్నికలు, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తుపైనే జనసేన అభ్యర్ధులు పోటీ చేశారు. అయితే మధ్యలో గాజు గ్లాస్ ను ఫ్రీ సింబల్ గా ప్రకటించింది ఎన్నికల సంఘం. ఇప్పుడేమో తిరిగి ఆ పార్టీకే ఇవ్వడంపై హై కోర్టును ఆశ్రయించారు.

జనసేన పార్టీకి 'గాజుగ్లాసు' గుర్తు కేటాయించడంపై అభ్యంతరం తెలియజేస్తూ దాఖలైన పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ జనసేనకు గాజుగ్లాసు గుర్తు కేటాయించడాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ దరఖాస్తును పట్టించుకోకుండా ఎన్నికల కమిషన్ (ఈసీ) గాజు గ్లాసు గుర్తును జనసేనకు కేటాయించడాన్ని తన పిటిషన్‌లో తప్పుబట్టారు. ఎన్నికల కమిషన్ కార్యదర్శి, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల చీఫ్ ఎలక్టోరల్ అధికారులు, హైదరాబాద్ లోని జనసేన పార్టీ అధ్యక్ష/కార్యదర్శిని ప్రతివాదులుగా పేర్కొన్నారు పిటిషనర్‌. ఆ వ్యాజ్యంపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. గాజు గ్లాసును ఫ్రీ సింబల్ గా 2023లో ఈసీ ప్రకటించిన వెంటనే ఆ గుర్తు కోసం మొదటగా దరఖాస్తు చేశానని అంటున్నారు పిటిషనర్ . ఆర్‌పీసీ ధరఖాస్తు పట్టించుకోకుండా జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తు కేటాయిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది.. అయితే, తమకే గాజు గ్లాసు గుర్తును కేటాయించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని హైకోర్టును కోరారు పిటిషనర్‌.

Updated On 12 Feb 2024 10:56 PM GMT
Yagnik

Yagnik

Next Story