Breaking news : అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వొచ్చు
ఆర్-5 జోన్‌లో(R-5 zone) పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వొచ్చంటూ తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు(supreme Court).
అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపులకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్5 జోన్‌లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వొచ్చని, పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే హక్కు ప్రభుత్వానికి ఉందని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలను ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ కె.ఎం. జోసెఫ్ , జస్టిస్ అరవింద్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ చేపట్టింది. ఆర్5 జోన్‌లో పట్టాల పంపిణీపై సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. వాదనలు ముగిసిన తర్వాత సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. చట్టం ప్రకారమే ఐదు శాతం ఈడబ్ల్యూఎస్‌కు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, అయితే కేసు తుది ఉత్తర్వులకు లోబడే ఇళ్ల పట్టాలపై హక్కులుంటాయని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. సుప్రీం తీర్పుతో పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపులో అడ్డంకులు తొలగిపోయాయి. ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా ఈ నెల 26న లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ జరగనుంది.