కడపలో ఏపీ కాంగ్రెస్‌ చీఫ్‌ వైఎస్ షర్మిల తరఫున కాంగ్రెస్ అగ్రనేత

కడపలో ఏపీ కాంగ్రెస్‌ చీఫ్‌ వైఎస్ షర్మిల తరఫున కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ప్రచారంలో పాల్గొన్నారు. అంతకుముందు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సమాధి వద్ద వైఎస్ షర్మిలతో కలిసి రాహుల్‌గాంధీ నివాళులు అర్పించారు. బహిరంగ సభలో రాహుల్‌గాంధీ మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి పది సంవత్సరాల పాటు ప్రత్యేక హోదాను కల్పిస్తామని రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులందరికీ మద్దతుగా నిలవాలని కోరారు. ఏపీ ప్రజలకు సంక్షేమాన్ని అందించగల ఏకైక పార్టీ కాంగ్రెస్సే అని రాహుల్‌గాంధీ చెప్పారు.

బీజేపీ వద్ద ఏపీ నేతలు చేతులు కట్టుకోవడంతోనే ఏపీకి ప్రత్యేక హోదా రాష్ట్రానికి రాలేదని.. పోలవరం, కడప స్టీల్‌ ప్లాంట్‌ రాలేదని చెప్పారు. రాజీవ్‌గాంధీ, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అన్నదమ్ముల్లా కలిసి ఉండేవారని రాహుల్‌ గాంధీ అన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఏపీకే కాదు.. మొత్తం దేశానికి దారి చూపించిన నాయకుడంటూ కొనియాడారు. పాదయాత్రల ద్వారానే ప్రజల సమస్యలు తెలుస్తాయని వైఎస్ఆర్ చెప్పినట్లు గుర్తు చేశారు. భారత్‌ జోడో యాత్రకు స్ఫూర్తి వైఎస్సార్‌ పాదయాత్రే అని రాహుల్‌గాంధీ అన్నారు.

Updated On 11 May 2024 4:52 AM GMT
Yagnik

Yagnik

Next Story