ఎన్నికల సందర్భంగా జరిగిన ఘర్షణలతో పల్నాడు పరువు పోయిందని ఎస్పీ మల్లికా గార్గ్ అన్నారు.

ఎన్నికల సందర్భంగా జరిగిన ఘర్షణలతో పల్నాడు పరువు పోయిందని ఎస్పీ మల్లికా గార్గ్ అన్నారు. మ‌రో నాలుగు రోజుల్లో ఎన్నికల కౌంటింగ్ ఉన్న నేపథ్యంలో పల్నాడు జిల్లాలోని న‌ర‌స‌న‌రావుపేట‌, వినుకొండ ప్రాంతాల‌లో వందలాది మంది పోలీసులు, కేంద్ర బలగాలతో కవాతు నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశం మొత్తం నవ్వుకునేలా.. బ్యాడ్‌గా మాట్లాడుకునేలా పల్నాడు జిల్లా పరువుతీశారని అన్నారు. ఎన్నికల సందర్భంగా జరిగిన ఘర్షణలు.. మళ్లీ జరగనివ్వనని స్పష్టం చేశారు. పోలీసులు ఉన్నా ఏ కారణాల వల్ల పల్నాడులో దారుణమైన ఘటనలు జరిగాయని ప్ర‌శ్నించారు.

పల్నాడు పేరు చెడగొట్టారని.. మాచర్ల, నరసరావుపేటల్లో జరిగిన గొడవలతో దేశమంతటా ఆ పేరు మార్మోగింద‌ని ఆమె అన్నారు. పది రోజుల వ్యవధిలో 160 కేసులు నమోదు కావడాన్ని ఏ పోలీస్ అధికారి కోరుకోరన్నారు. పల్నాడు తర్వాత స్థానంలో ఉన్న జిల్లాలో 70 కేసులు నమోదయ్యాయని చెప్పారు. ఘర్షణల కేసుల్లో ఇప్పటి వరకు 1300 మందిని అరెస్టు చేశామని, 400 మందిపై రౌడీషీట్లు తెరిచినట్టు ఎస్పీ ప్రకటించారు. గొడవల్లో జైళ్లకు వెళుతున్న వారంతా సామాన్యులేనని.. అన‌వ‌స‌ర‌పు గొడ‌వ‌ల‌కు వెళ్లి జీవితాలు నాశ‌నం చేసుకోవ‌ద్ద‌ని సూచించారు.

Updated On 30 May 2024 10:55 PM GMT
Yagnik

Yagnik

Next Story