త్వరలో జగన్ ప్రజాదర్బార్..!

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 8 నెలలు కావొస్తుంది. ప్రభుత్వ హామీల అమలు, ప్రజా సమస్యలపై ఇక వైఎస్ జగన్ పోరుబాట పట్టనున్నారని తెలుస్తోంది. ఇందుకు ఆయన ఓ కొత్త పంథాను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని పులివెందులలో చేపట్టారు. డిసెంబర్‌లో పులివెందులలో పర్యటించిన ఆయన.. భాకరాపురం క్యాంపు కార్యాలయంలో జగన్‌మోహన్‌రెడ్డి.. కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో మమేకమయ్యారు. వారి బాధలు, కష్టాలు, సమస్యలు వింటూ నేనున్నాను అంటూ భరోసాతో పాటు ధైర్యాన్ని కల్పించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించి, యోగక్షేమాలు తెలుసుకుని, వారి సమస్యలు ఓపిగ్గా విని, వారికి భరోసా కల్పించారు. అయితే ఇదే తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా ఆయన నిర్వహించాలనకుంటున్నారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రతిరోజూ ఉదయం ఒక గంట పాటు ప్రజాదర్బార్ నిర్వహించారు. చాలా విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. వైఎస్ చేపట్టిన ప్రజాదర్బార్‌కు మంచి ఆదరణ కూడా లభించింది. నేరుగా ముఖ్యమంత్రికే తమ సమస్య చెప్పుకుంటే తప్పక పరిష్కారం దొరుకుతుందని ప్రజలు ఎంతో ఆశగా వచ్చి ఆయనను కలిసేవారు. వైఎస్ కూడా చాలా ఓపికగా ఉండి ప్రజాసమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నించారు. కానీ ఆయన తర్వాత ఏ ముఖ్యమంత్రి కూడా ఈ తరహాలో కార్యక్రమం చేపట్టలేదు. ఆయన తర్వాత ఏపీకి ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు, జగన్ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లలేకపోయారు. అయితే జగన్ ప్రతిపక్ష నేత అయిన తర్వాత వైఎస్ చేపట్టిన ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని తాను కూడా చేపడితే ఎలా ఉంటుందన్న కోణంలో ఆలోచిస్తున్నారట. ఇప్పటికే పులివెందులలో ప్రజాదర్బార్ నిర్వహించిన సమయంలో అక్కడ మంచి స్పందన వచ్చిందని.. తాడేపల్లిలో ఈ తరహా కార్యక్రమం నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కష్టకాలంలో అటు కార్యకర్తలను కాపాడుకుంటూ, ఇటు ప్రజా సమస్యలను తెలుసుకుంటే మంచి ఫలితాలు వస్తాయని జగన్ భావిస్తున్నారట. త్వరలోనే ఈ కార్యక్రమాన్ని పట్టాలు ఎక్కించేపనిలో పడ్డారట జగన్.
