రఘునాథరెడ్డి(raghunath reddy) అనే వ్యక్తి లెక్చరర్‌గా పనిచేశాడు. ఆన్ లైన్ ట్రేడింగ్‌కు(Online Trading) అలవాటు పడిన రఘునాథరెడ్డి రూ. 14 లక్షల వరకు అప్పులు చేశాడు

రఘునాథరెడ్డి(raghunath reddy) అనే వ్యక్తి లెక్చరర్‌గా పనిచేశాడు. ఆన్ లైన్ ట్రేడింగ్‌కు(Online Trading) అలవాటు పడిన రఘునాథరెడ్డి రూ. 14 లక్షల వరకు అప్పులు చేశాడు. అప్పులు(Debts) ఇచ్చినవారు ఒత్తిడి చేయడంతో తన తండ్రిపై ఆస్తి పంచివ్వాలని ఒత్తిడి చేశాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య పలుసార్లు వాగ్వాదం చోటు చేసుకుంది. ఎన్నిసార్లు అడిగినా తండ్రి ఆస్తి పంచివ్వకపోవడంతో ఆగ్రహం చెందిన రఘునాథరెడ్డి కారుతో ఢీకొట్టి తండ్రిని చంపేశాడు. అసలు ఎవరీ రఘునాథరెడ్డి.. వివరాల్లోకి వెళ్తే

అన్నమయ్య జిల్లా(annamayya) మదనపల్లెలోని(madamapalle) పుల్లారెడ్డి వీధిలో నివాసం ఉంటున్న మీరుగట్టు చిన్నరెడ్డప్పరెడ్డి (65)కు ఇద్దరు కుమారులున్నారు. ఇద్దరిలో పెద్దోడే రఘునాథరెడ్డి, మరొకరు శంకర్‌రెడ్డి. రఘునాథరెడ్డి స్థానికంగా ఉన్న ఓ కాలేజ్‌లో లెక్చరర్‌గా పనిచేశాడు. ఉద్యోగాన్ని వదిలేసి ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. రెండో కొడుకు శంకర్‌రెడ్డి బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. శని, ఆదివారాల్లో మదనపల్లెకు వచ్చి వెళ్లేవాడు. రఘునాథరెడ్డి మాత్రం మదనపల్లెలోనే ఉంటూ జల్సా చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ చేసి అప్పుల పాలయ్యాడు. దాదాపు 14 లక్షల అప్పు తీసుకున్నాడు. అప్పు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి పెరగడంతో తండ్రి ఆస్తిలో వాటా కావాలని కోరుతున్నాడు. అందుకు తండ్రి చిన్నరెడ్డప్ప రెడ్డి, తమ్ముడు శంకర్‌రెడ్డి ఒప్పుకోలేదు. ఈ విషయంలోనే తండ్రి, కొడుకు మధ్య పలు సార్లు వాగ్వాదం జరిగింది. ఓ సందర్భంలో తండ్రిపై చేయికూడా చేసుకున్నాడని చెప్తున్నారు. తండ్రిని హత్య చేస్తే కానీ తనకు ఆస్తి దక్కదని, అతడిని చంపాలని ప్లాన్ వేశాడు.

ఈ క్రమంలోనే బుధవారం రోజు రాత్రి తండ్రి భోజనం చేసిన తర్వాత వాకింగ్‌కు వెళ్లాడు. అప్పటికే రోడ్డు పక్కన కాపు కాసిన రఘునాథరెడ్డి తండ్రితో మరోసారి ఘర్షణకు దిగాడు. రోడ్డుపైనే తండ్రి చిన్నరెడ్డప్పరెడ్డితో గొడవపడ్డాడు. అయినా ఆస్తి పంపకాలు చేసేది లేదని తండ్రి గట్టిగా చెప్పడంతో రఘునాథరెడ్డి కోపోద్రిక్తుడయ్యాడు. తన కారుతో బలంగా తండ్రిని ఢీకొట్టాడు. ఆ తర్వాత చిన్నరెడ్డప్పరెడ్డి చిన్న కొడుకు శంకర్‌రెడ్డికి ఫోన్‌ చేసి మీ అయ్యను చంపిన అని చెప్పాడు. దీంతో భయపడిన శంకర్‌రెడ్డి స్థానికంగా ఉన్న బంధువులు, స్నేహితులకు ఫోన్‌ చేసి విషయం చెప్పాడు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు, కుటుంబసభ్యులు, స్నేహితులు చిన్నరెడ్డప్పరెడ్డి కోసం ముమ్మర గాలింపు చేపట్టినా ఫలితం లేదు. గురువారం తెల్లవారుజామున మదనపల్లెలోని వీకర్స్‌ కాలనీలో జనారణ్యం లేని ప్రాంతంలో చిన్నరెడ్డప్పరెడ్డి మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, నిందితుడు రఘునాథరెడ్డిని అరెస్ట్ చేశారు. ఆస్తి కోసం కన్న తండ్రినే దారుణంగా హత్య చేసిన రఘునాథరెడ్డి వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశమైంది.

Eha Tv

Eha Tv

Next Story