Ramatheertam : శ్రీరాముని కొలువులో శివనామస్మరణం.. ఎక్కడుందా ఆలయం?
విజయనగర పట్టణానికి ఈశాన్యంలో పన్నెండు కిలోమీటర్ల దూరంలోని నెల్లిమర్ల మండలంలో ఉన్న సుప్రసిద్ధ ఆలయం రామతీర్థం దర్శనీయస్థలంగా విలసిల్లుతోంది. కొండల నడుమ కొలువుదీరిన కోదండరాముని దర్శించుకుంటే కోరిన కోరికలు తప్పక తీరుతాయన్నది భక్తుల విశ్వాసం. ఈ ఆలయాన్ని పాండవులు నిర్మించారని స్థలపురాణం చెబుతోంది.
విజయనగర పట్టణానికి ఈశాన్యంలో పన్నెండు కిలోమీటర్ల దూరంలోని నెల్లిమర్ల మండలంలో ఉన్న సుప్రసిద్ధ ఆలయం రామతీర్థం(Ramateertham) దర్శనీయస్థలంగా విలసిల్లుతోంది. కొండల నడుమ కొలువుదీరిన కోదండరాముని దర్శించుకుంటే కోరిన కోరికలు తప్పక తీరుతాయన్నది భక్తుల విశ్వాసం. ఈ ఆలయాన్ని పాండవులు నిర్మించారని స్థలపురాణం చెబుతోంది. పూర్తి రాతికట్టడంతో, విశాలమైన ప్రాకారంతో ఉన్న ఈ క్షేత్రంలో ప్రసన్నవదనంతో శ్రీరామచంద్రుడు సీతా లక్ష్మణ సమేతుడై తూర్పు ముఖంగా భక్తులకు దర్శన భాగ్యం కలిగిస్తున్నాడు. నిలువెత్తు ధ్వజస్తంభం దాటుకుని ఆలయంలోకి ప్రవేశించిన అనంతరం గర్భగుడిలోని స్వామివారికి మొక్కుబడులు తీర్చుకున్న తర్వాత దక్షిణదిక్కువైపు వచ్చి ఉపాలయాలను సందర్శించే వీలు కల్పించారు. హోమ, జపతపాలకు, యజ్ఞయాగాదులకు నెలకొల్పిన పూరి కుటీరాలలోని సేదతీరుతున్న తాబేళ్లు భక్తులకు కనువిందు చేస్తాయి. ఇవి రాతిపైనే తన జీవనం సాగిస్తు, స్వామి వారి సన్నిధానంలో సందడి చేస్తుంటాయి.
శ్రీరామనవమి నాడు భద్రాద్రి మాదిరిగానే అన్ని అనవాయితీలు పాటిస్తూ శ్రీరామచంద్రుడికి, సీతమ్మ వారికి జరిగే కల్యాణాన్ని చూసేందుకు వేలాదిగా భక్తులు ఇక్కడకు తరలి రావటం తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ. ఆ కల్యాణ వైభోగాన్ని ఒళ్లంతా కళ్లు చేసుకొని చూస్తే తనివి తీరా, తనువు తీరా సీతారాముల కల్యాణం చూశామన్న అనుభూతి కలుగుతుంది. అలాగే ప్రతీ ఏడాది మాఘశుద్ధ ఏకాదశి అంటే భీష్మ ఏకాదశి నాడు జగదభిరాముడు మరోసారి కల్యాణరాముడుగా మారుతాడు. సీతమ్మ వారితో ఏడడుగులు నడిచి, అగ్నిసాక్షిగా సీతమ్మను తన సొంతం చేసుకుంటాడు. ముత్యాలపందిరిలో ముత్తయిదువుల సమక్షంలో, వేలాది మంది ప్రజలకు అఖండ దర్శన భాగ్యాన్ని కల్పిస్తాడు. ముత్యాల తలంబ్రాలు పోసుకొని నవ వధువుతో మురిసిపోతాడు. భద్రాద్రిని తలపించే రీతిలో దేవస్థాన అరుబయలు ప్రదేశంలో సీతారాముల కల్యాణం కన్నుల పండుగగా జరిపే ఆచారం పూర్వం నుండి ఇక్కడ నిర్విఘ్నంగా కొనసాగటం విశేషం. దేవుని కల్యాణం జరిగిన తర్వాతే తమ వారసులకు కుదుర్చుకున్న వివాహాలు తమ ఇళ్లలో జరుపుకోవటం ఈ ప్రాంత ప్రజలకు అనాది వస్తున్నా ఆచారం.
విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన అలనాటి పూసపాటి గజపతుల మూలపురుషుల్లో ఒకరైన పూసపాటి సీతారామచంద్రమహారాజు 1650-1696 మధ్య తన హయాంలో ఈ దేవాలయం నిర్మించినట్టు చరిత్ర చెబుతోంది. మరి కాస్తా దూరంగా ఆలోచిస్తే పాండవులు తాము నిర్మించిన ఆలయాన్ని వేదగర్భుడు అనే వైఖానస వైష్ణవునికి ఈ ఆలయం అప్పగించి వెళ్లిపోయినట్టు, అనతి కాలంలోనే ఆ వేదగర్భుడు క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్ధంలో బౌద్ధ బిక్షవులకు ఆలయంలో విగ్రహారాధన చేయకూడదని రాముని ప్రతిమలు భూమిలో భద్రపరచినట్టు చరిత్ర చెబుతోంది. కొన్నేళ్లు గడచిన తరువాత ప్రస్తుతం పూసపాటిరేగ మండలంలో ఉన్న కుమిలి గ్రామానికి చెందిన ఓ మూగ ముదుసలికి రాముల వారు కనపించి మీ రాజు చేత ప్రతిమలకు ప్రాణప్రతిష్ట చేయమని సెలవిచ్చినట్టు ఇక్కడ శాసనం తెలియచేస్తోంది. ఈ నేపథ్యంలోనే పూసపాటి గజపతులు 12 వందల ఎకరాల భూమిని స్వామి వారి సేవ కోసం కేటాయించారు. దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అర్చక స్వాముల ఏర్పాటు చేసిన నాటి నుండి నేటి వరకు నిత్యం ధూప, దీప, నైవేద్యాలు అందిస్తు ఏడాదిలోని పలు ఉత్సవాలు నిర్వహణకు తగిన ఒనరులు ఆనాడే సమకూర్చారు. స్వామి వారికి, అమ్మవారికి రెండు కిలోల బంగారు ఆభరణాలను కానుకలుగా అందించారు. ఈ క్షేత్రంలో మరో విశేషమైన విశిష్టత అనాదిగా కొనసాగుతోంది. శైవమైనా, వైష్ణవమైనా ఒకటేనన్న మూల మంత్రాన్ని ఈ దేవస్థానం పఠిస్తోంది, ఆచరిస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా రాముని కోవెలలో ఓం నమః శివాయ శబ్ధం వినిపిస్తుంది. కార్తీక మాసం సైతం ఈ ఆలయం భక్తులతో కిక్కిరిసిపోతుంది. శంభోశంకరా అని నోరారా ఆ దివ్య నామాన్ని రాముని సన్నిధిలో జపిస్తుంటారు భక్తులు. మరి కొంత మంది జై శ్రీరామ్ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినదిస్తుంటారు. ఇంకొంతమంది జై భవాని అంటూ అమ్మవారిని వేడుకుంటారు. మహా శివరాత్రి వస్తే చాలు ఇక్కడ ఊరు వాడా ఏకమైపోతుంది. ఉత్తరాంధ్రా నుండే కాకుండా పొరుగు రాష్ట్రమైన ఒరిస్సా నుండి పెద్ద ఎత్తున భక్తులు తండోపతండాలుగా తరలివస్తారు. శ్రీరాముని పాదాల చెంత శివనామస్మరణ చేస్తారు. గ్రామాల నుండి వచ్చిన భక్తులు జానపద జాతరను తలపిస్తారు. శంభోశంకరా అంటూ ఊగిపోతుంటారు...తూగిపోతుంటారు. ఎగిరి గంతులేస్తారు. పెద్ద పెద్ద జ్యోతులు వెలిగించి అఖండ నీరాజనాలు అందిస్తారు. దేవాలయానికి అనుకొని ఉన్న విశాలమైన కోనేరులో పుణ్య స్నానాలు చేసేందుకు స్వచ్ఛమైన నీరు అందుబాటులో వుంటుంది. అలాగే తలనీలాలు సమర్పించే వారి సంఖ్య ఏడాదికి ఆ ఏడాది పెరుగుతూ వస్తోంది. దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు విడిది చేసేందుకు కుటీరాలను ఏర్పాటు చేశారు. రాముని చెంత ఈశ్వరుని ఆరాధించటం మూలంగా దేవాలయానికి ఆనుకొని సుమారు నూటయాభై ఏళ్ల క్రితం శివలింగాన్ని ప్రతిష్టించారు. దీనిని ఆనుకొని ఉన్న ఉపాలయాల్లో ఎడమవైపు గణపతి, కుడి భాగాన అమ్మవార్ల ప్రతిమలకు ప్రాణ ప్రతిష్ట చేశారు. ఈ ఆలయానకి కూడా నిత్యం ధూప దీప నైవేద్యాలు అందిస్తున్నారు.