Fake IPS Officer : ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పర్యటనలో భద్రతాలోపం..!
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటన సందర్భంగా భద్రతాలోపం స్పష్టంగా కనిపించింది. ఓ వ్యక్తి ఐపీఎస్ యూనిఫాంతో వచ్చాడు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటన సందర్భంగా భద్రతాలోపం స్పష్టంగా కనిపించింది. ఓ వ్యక్తి ఐపీఎస్ యూనిఫాంతో వచ్చాడు. పవన్ పర్యటనలో తానే ఆసాంతం అన్నట్లు వ్యవహరించాడు. పోలీసులు కూడా అతనికి సెల్యూట్ చేసి ఫొటోలు దిగారు. అయితే అతణ్ణి విజయనగరం జిల్లా ముడిదాం ప్రాంతానికి చెందిన వాడిగా గుర్తించారు. ఏడాది క్రితం ఐపీఎస్‌కు సెలక్ట్ అయ్యానని స్థానికులకు చెప్పిన సూర్యప్రకాష్ చెప్పుకున్నాడు. శిక్షణలో ఉండి పవన్ కల్యాణ్ పర్యటన కోసం వచ్చానని చెప్పాడు. అయితే సదరు వ్యక్తి విజయనగరం నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు ప్రయత్నించగా సరిహద్దుల్లో అదుపులోకి తీసుకున్నారు. సూర్యప్రకాష్ పారిపోయేందుకు ఏఆర్ కానిస్టేబుల్ కూడా సహకరించాడు. తన సొంత కారును కానిస్టేబుల్ ఇంటి దగ్గరే ఉంచి మరో కారులో వెళ్లేందుకు ప్రయత్నించాడు. నిజమైన ఐపీఎస్సేనా అని పోలీసులు విచారిస్తున్నారు. సూర్యప్రకాష్ పార్వతీపురం డివిజన్ తూనికలు, కొలతలు విభాగంలో లైసెన్స్ రిపేరర్‌గా పనిచేసినట్లు పోలీసులు గుర్తించారు. మన్యం జిల్లా అంటే మావోయిస్టులకు పెట్టింది పేరు. అలాంటి సెన్సెటివ్ ప్రాంతంలో డిప్యూటీ సీఎం పవన్ పర్యటనలో ఒక అనామకుడు ఏకంగా ఐపీఎస్ వేషంలో వచ్చి హల్‌చల్ చేయడంతో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపించిందని చర్చించుకుంటున్నారు. పవన్ కల్యాణ్‌కు పటిష్టమైన భద్రత కల్పించాలని, పోలీసులు సరైన చర్యలు తీసుకోవాలని జనసేన నేతలు డిమాండ్ చేస్తున్నారు.