Sajjala Ramakrishna Reddy : జనసేన 100 స్దానాలలో పోటీ చేసి మిగిలినవి టీడీపీకి ఇస్తుందా.?
వచ్చే ఎన్నికల్లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సహకారంతో అధికారంలోకి రావాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పగటి కలలు కంటున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ..

Sajjala Ramakrishna Reddy Fire on Janasena And TDP
వచ్చే ఎన్నికల్లో జనసేన(Janasena) అధ్యక్షుడు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సహకారంతో అధికారంలోకి రావాలని టీడీపీ(TDP) అధ్యక్షుడు చంద్రబాబు(Chandrababu) పగటి కలలు కంటున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy) ఎద్దేవా చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. అవినీతి, అక్రమాలతో 2014–19 మధ్య రాష్ట్రాన్ని చంద్రబాబు ధ్వంసం చేశారని ప్రజలకు నిర్ధారణకు వచ్చే.. 2019 ఎన్నికల్లో 151 శాసనసభ స్థానాల్లో గెలిపించి వైఎస్సార్‌సీపీకి అఖండ విజయాన్ని అందించారని గుర్తు చేశారు.
చంద్రబాబు ధ్వంసం చేసిన రాష్ట్రాన్ని నాలుగున్నరేళ్లుగా సీఎం వైఎస్ జగన్(YS Jagan) సుపరిపాలనతో ఒక్కో ఇటుక పేర్చుకుంటూ అన్ని రంగాల్లో ప్రగతిపథంలో నిలిపారన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలో రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచిందని గుర్తు చేశారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ ఆర్థిక ఇబ్బందులున్నా ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు అన్ని సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజలకు దన్నుగా నిలిచారని వివరించారు. మంచి చేసిన సీఎం వైఎస్ జగన్‌కు ప్రజలు అండగా నిలుస్తున్నారు కాబట్టే 175కు 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా తాము మందుకెళ్తున్నామన్నారు.
గత ఎన్నికల కంటే మరింత మెరుగైన ఫలితాల కోసమే ఒక చోట టికెట్ ఇవ్వలేకపోతే మరో చోట కేటాయిస్తున్నామని స్పష్టం చేశారు. సీఎం వైఎస్ జగన్ నిర్ణయానికి వైసీపీ నేతలు, కార్యకర్తలు కట్టుబడి ఉంటారని.. ఎక్కడైనా చిన్న చిన్న అసంతృప్తులు ఉంటే సర్దుకుంటాయన్నారు. రాష్ట్రంలో 175కు 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ ముందుకెళ్తుంటే.. సీఎం వైఎస్ జగన్ ఏం తప్పు చేస్తారా? దానిపై ఎలా చిల్లర రాజకీయాలు చేద్దామా అనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారంటూ విమర్శించారు.
ఎత్తిచూడానికి తప్పులు ఏమీ లేకపోవడంతో సీఎం వైఎస్ జగన్, ప్రభుత్వంపై ఎల్లో మీడియాతో నిత్యం బురదజల్లుతూ తప్పుడు వార్తలు రాయిస్తూ.. ఆ భ్రమల్లోనే చంద్రబాబు బతుకుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా అలాంటి చిల్లర రాజకీయాలు మానుకో అంటూ చంద్రబాబుకు హితవు పలికారు. ఎన్టీఆర్‌కు 1995లో వెన్నుపోటు పొడిచి చంద్రబాబు టీడీపీని లాక్కున్నప్పటి నుంచి.. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి గెలిచిన దాఖాలాలు లేవని అన్నారు.
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు స్కిల్ స్కాం(Skill Scam)లో రిమాండ్‌పై జైల్లో ఉన్నప్పుడు టీడీపీ కార్యకర్తలు ఏ ఒక్కరూ పట్టించుకోలేదని అన్నారు. శిథిలమైపోయిన టీడీపీని ఏలుతున్న చంద్రబాబుకు జనసేన కలిసిరాకపోతే ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం కూడా లేదన్నారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి టీడీపీకి అభ్యర్థులు ఉన్నారో కూడా తెలియన దుస్థితిలో.. పవన్‌ను నమ్ముకునే చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారంటూ ఎధ్దేవా చేశారు. జనసేనతో పొత్తు పెట్టుకుంటే కాపు సామాజికవర్గం అంతా తనకు మద్దతు ఇస్తుందని చంద్రబాబు పగటికలలు కంటున్నారని విమర్శించారు.
టీడీపీ 100 స్దానాలలో పోటీ చేస్తుందా.? లేదా 90 టీడీపీ తీసుకుని 85 పవన్ కల్యాణ్‌కు ఇస్తారా.? జనసేన 100 స్దానాలలో పోటీ చేసి టీడీపీ మిగిలిన వాటిలో పోటీ చేస్తుందా? ముఖ్యమంత్రి అభ్యర్ది ఎవరు.? జనసేన-టీడీపీ సమన్వయకమిటీ సమావేశాలు ఏమయ్యాయి.. ఈ ప్రశ్నలకు వారే సమాధానం చెప్పాలి.. ఎందుకంటే వారికి ఏ విషయంలో స్పష్టత లేదు. అసలు 175 స్దానాలలో వారికి అభ్యర్దులు ఉన్నారా అనేది అనుమానమే అని ఎద్దేవా చేశారు.
తెలంగాణా(Telangana)లో కాంగ్రెస్ పార్టీ(Congress Party)కి షర్మిల(Sharmila) మధ్దతు ఇచ్చారు. ఇప్పుడు ఏపీ ఎన్నికల(AP Elections)లో షర్మిల ఇక్కడకు కాంగ్రెస్ తరపున వస్తారు అని కాంగ్రెస్ నేతలంటున్నారనే మీడియా ప్రశ్నకు సమాధానమిస్తూ.. ఏ రాజకీయపార్టీ అయినా ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి రాజ్యాంగం అవకాశం కల్పించింది. ఎవరు ఉన్నా అందరూ కలసి వచ్చిన ఫేస్ చేయగలమన్నారు. ఫేస్ చేసి అందరికంటే మిన్నగా ఢంపింగ్ మెజారిటీతో ప్రజల ఆశీస్సులు పొందగలమని ధీమా వ్యక్తం చేశారు. పబ్లిక్ గా మనకు తెలిసింది ఏమంటే షర్మిల తెలంగాణాలో రాజకీయపార్టీ పెట్టారు. తెలంగాణాలో యాక్టివిటి చేయాలని నిర్ణయించుకున్నారు. అదే నిజమని అనుకుంటున్నాం. కాంగ్రెస్ నేతల ఊహాగానాలు కావచ్చు.వారికి ఏదైనా సమాచారంతో మాట్లాడి ఉండవచ్చు అని అనుకుంటున్నానని సజ్జల అన్నారు.
