ఏపీ రాజకీయాల్లో శుక్రవారం ఆసక్తికర పరిణామం జరిగింది.

ఏపీ రాజకీయాల్లో శుక్రవారం ఆసక్తికర పరిణామం జరిగింది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి శైలజానాథ్ ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలకు ఝలక్ ఇచ్చారు. హస్తం పార్టీకి గుడ్ బై చెప్పేశారు. తాడేపల్లికి వెళ్లి మరీ సాకే శైలజానాథ్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. వైసీపీ కండువా కప్పి ఆయనను జగన్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. జగన్ నుంచి కీలక హామీ దక్కిన తర్వాతే శైలజానాథ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. 2029 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో శైలజానాథ్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉంది. జగన్ నుంచి ఈ మేరకు హామీ దక్కాకే శైలజానాథ్ ముందడుగు వేసినట్లు సమాచారం. శైలజానాథ్ చేరికతో శింగనమలలో పార్టీ బలం మరింత పుంజుకుంటుందని వైసీపీ ఆశిస్తోంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అప్పటి ప్రభుత్వంలో శైలజానాథ్ కీలకంగా ఉన్నారు. 2004, 2009లో కాంగ్రెస్ పార్టీ తరపున శింగనమల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. 2014, 2019లో శింగనమల నియోజకవ్గం నుంచే కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2022 జనవరి నుంచి నవంబర్ వరకు ఏపీ పీసీసీ చీఫ్గా కూడా ఆయన పనిచేశారు. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో శైలజానాథ్ టీడీపీలో చేరతారనే ప్రచారం జోరుగా జరిగింది. అయినప్పటికీ ఆయన ఆ నిర్ణయం తీసుకోలేదు. జేసీ బ్రదర్స్ రాయబారంతో ఆహ్వానం అందినా ఏ కారణాలతోనో ఆయన తెలుగుదేశం పార్టీ వైపు చూడలేదు. షర్మిల ఏపీ పీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కొన్నాళ్లు ఆమె వెన్నంటే ఉన్న శైలజానాథ్ కొన్ని నెలలుగా కాంగ్రెస్ పార్టీకి దూరం జరిగారు. దీంతో.. ఆయన అధికార తెలుగుదేశంలోకి వెళ్లే యోచన చేస్తున్నారని శింగనమల నియోజకవర్గంలో పుకార్లు షికారు చేశాయి. కానీ.. ఆయన అనూహ్యంగా జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకోవడంతో ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.

శింగనమల నియోజకవర్గంలో వైసీపీ గ్రూపు రాజకీయాలతో ఇప్పటికే సతమతమవుతోంది. శైలజానాథ్ వైసీపీలో చేరడంతో శింగనమల వైసీపీలో మున్ముందు పరిస్థితులు ఎలా ఉండనున్నాయో అనే చర్చ స్థానికంగా జరుగుతోంది. 2024 ఎన్నికల్లో శింగనమల ఎమ్మెల్యే టికెట్ జొన్నలగడ్డ పద్మావతికి దక్కలేదు. దీంతో.. ఆమె అప్పటి నుంచి కూడా వైసీపీతో అంటీముట్టనట్టుగానే ఉంటున్నారు. మన్నెపాకుల వీరాంజనేయులు 2024లో శింగనమల నియోజకవర్గం నుంచి పోటీ చేసి బండారు శ్రావణిశ్రీ చేతిలో ఓడిపోయారు. సాకే శైలజానాథ్ కూడా కాంగ్రెస్ నుంచి పోటీ చేయగా కేవలం 3,469 ఓట్లు మాత్రమే పోలయి 2 శాతం ఓట్లను మాత్రమే దక్కించుకున్నారు. శింగనమల ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం.

ehatv

ehatv

Next Story