Jail Superintendent Rahul : రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్ భార్య మృతి.. వాస్తవాలు ప్రచురించండన్న ఉన్నతాధికారులు
రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్ భార్య చనిపోయిన విషయంపై మీడియా వక్రీకరించి వార్తలను ప్రచురించవద్దని జిల్లా ఎస్పీ, కోస్తా జిల్లాల జైళ్ళ శాఖ డిఐజి పేర్కొన్నారు.
రాజమండ్రి సెంట్రల్ జైలు(Rajahmundry Central Jail) సూపరింటెండెంట్ రాహుల్(Rahul) భార్య చనిపోయిన విషయంపై మీడియా వక్రీకరించి వార్తలను ప్రచురించవద్దని జిల్లా ఎస్పీ, కోస్తా జిల్లాల జైళ్ళ శాఖ డిఐజి పేర్కొన్నారు. రాజమండ్రి లోని నవీన్ మల్టీ సూపర్ స్పెషాలిటీ(Naveen Multi Super Speciality Hospital) హాస్పిటల్ లో రాహుల్ భార్య కిరణ్మయి(Kiranmai) చికిత్స పొందుతూ మరణించినట్లు డిఐజీ తెలిపారు. విషయం తెలిసిన వెంటనే డిఐజి రవికిరణ్(DIG Ravi Kiran), జిల్లా ఎస్పీ జగదీష్(SP Jagadeesh), ఇతర జైలు ఉన్నతాధికారులు హాస్పిటల్ కు వెళ్లి రాహుల్ ను పరామర్శించారు. రాహుల్ భార్య కిరణ్మయి మరణం పట్ల అధికారులందరూ ప్రగాడ సానుభూతిని తెలియజేశారు.
రాజమండ్రి సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ రాహుల్ తన భార్య ఆరోగ్య పరిస్థితి బాగోలేదని రెండు రోజుల క్రితం సెలవు తీసుకొని వెళ్లినట్లు జైళ్ళశాఖ డిఐజి రవికిరణ్ స్పష్టం చేశారు. చికిత్స పొందుతూ రాహుల్ భార్య చనిపోయినట్లు తెలిపారు. ఇలాంటి బాధాకర సమయంలో మీడియా ప్రతినిధులు జైలు ఉన్నతాధికారుల వద్ద క్లారిఫికేషన్ తీసుకుని వాస్తవాలు రాయాలని డిఐజీ సూచించారు. రాహుల్ భయపడి వెళ్లిపోయారని.. అధికారులు బలవంతంగా పంపించారనే వార్తలను జైలు డిఐజి రవికిరణ్ ఖండించారు. బాధలో ఉన్న అధికారుల పరిస్థితిని అర్థం చేసుకోవాలని తెలిపారు. అధికారులు ఎప్పుడూ తమ బాధ్యతలను విస్మరించరని పేర్కొన్నారు. గత మే నెలలోనే తన తల్లి కూడా చనిపోయారని, అందరం చాలా మెంటల్ స్ట్రెస్ లో ఉన్నామని జైలు డిఐజి గుర్తు చేశారు. మీడియా ప్రతినిధులు వాస్తవాలను మాత్రమే రాయండి. అధికారులను ఇబ్బంది పెట్టే విధంగా అవాస్తవాలు మాత్రం ప్రచురించకండని కోస్తా జిల్లాల జైళ్ల డిఐజి రవికిరణ్ స్పష్టంచేశారు.
రాజమండ్రి సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ రాహుల్ విషయంలో అవాస్తమైన వార్తలు వచ్చాయని జిల్లా ఎస్పీ జగదీష్(Jagadeesh) పేర్కొన్నారు. రాహుల్ విషయంలో మీడియా రిపోర్టర్లు వాస్తవాలను తెలుసుకొని వార్తలను రాయాలని కోరారు. ఆయన భార్య ఆరోగ్యం బాగా లేనందునే సెలవు పెట్టారనే వాస్తవ విషయాన్ని మీడియా ప్రతినిధులు అందరూ గమనించాలన్నారు. వార్త ప్రచురించే ముందు జర్నలిస్టులు కచ్చితంగా వాస్తవాలను తెలుసుకోవాలని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ జగదీష్ పేర్కొన్నారు.