Telugu States : తెలుగు రాష్ట్రాల్లో వర్ష బీభత్సం.. 20 మంది మృతి
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా రెండు రాష్ట్రాల్లో కనీసం 20 మంది మరణించారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా రెండు రాష్ట్రాల్లో కనీసం 20 మంది మరణించారు. రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వరదల కారణంగా పరిస్థితి మరీ దారుణంగా ఉంది. నదులు, కాలువలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. నీటి ఎద్దడి కారణంగా పలు రహదారులు, రైలు మార్గాలు మూసుకుపోయాయి. 54 రైళ్లను దారి మళ్లించగా.. 99 రైళ్లను రద్దు చేయాల్సి వచ్చింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు, తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డిలతో ఫోన్‌లో మాట్లాడి అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. హోంమంత్రి అమిత్ షా కూడా ఇద్దరు సీఎంలతో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. మరోవైపు రెండు రాష్ట్రాల్లోనూ 26 ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలలో నిమగ్నమై ఉండగా.. మరో 14 బృందాలను పంపనున్నారు.
హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఆదివారం భారీ వర్షం కురిసింది. రాష్ట్రంలో వర్షాల కారణంగా 9 మంది ప్రాణాలు కోల్పోగా.. ఒకరు గల్లంతయ్యారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు, అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించి పరిస్థితిని సమీక్షించి అవసరమైన ఆదేశాలు ఇచ్చారు.
రాష్ట్రంలోని ఆదిలాబాద్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్‌లో కూడా గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా 17,000 మంది బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రాష్ట్రంలోని 14 జిల్లాలు వరదల్లో చిక్కుకోగా.. తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారని.. ఒకరు గల్లంతయ్యారని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.