Rain Alert: ఏపీ-తెలంగాణకు వర్ష సూచన.. ఈ జిల్లాల్లో వర్షాలు
ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడనున్నాయని ఐఎండీ అధికారులు తెలిపారు
ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడనున్నాయని ఐఎండీ అధికారులు తెలిపారు. నైరుతి రుతుపవనాలు ఆదివారం రాయలసీమను తాకడంతో వర్షాలు మొదలవ్వనున్నాయి. మూడు రోజుల ముందుగానే అనంతపురం జిల్లా మీదుగా రాష్ట్రంలోకి ప్రవేశించాయి. ఇక రుతుపవనాలు రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నాయి. దక్షిణ కోస్తా పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని వాతావరణశాఖ తెలిపింది. రుతుపవనాలు, ఆవర్తనం ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు.
తెలంగాణలోకి కూడా ఇంకొన్ని రోజుల్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. నైరుతి పవనాల ప్రభావంతో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నైరుతి బంగాళాఖాతంతో పాటు కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడు తీరాలకు సమీపంలో కొనసాగుతోంది. ఈ ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురవనున్నాయి. నేడు, రేపు రాష్ట్రంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబాబాద్ జిల్లాల్లో నేడు ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు.