Rahu Ketu Pooja in Srikalahasti:శ్రీకాళహస్తిలో రాహు కేతు పూజలకు భారీగా తరలివచ్చిన భక్తులు
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో వెలసిన శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి ఎన్నో విశిష్టతలు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో వెలసిన శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. సువర్ణముఖీ నదీ తీరంలో నిర్మితమైన ఈ ఆలయం శిల్ప చాతుర్యానికి మచ్చుతునక ! ఇంత గొప్ప ఆలయం ఆంధ్రప్రదేశ్‌లో మరెక్కడా లేదంటే అతిశయోక్తి కాదు. లింగ రూపంలో స్వయంభువుగా వెలిశారు పరమశివుడు. పంచభూత క్షేత్రాలలో వాయు క్షేత్రంగా శ్రీకాళహస్తి ప్రసిద్ధిగాంచింది. గర్భగుడిలో ఉన్న దీపం లింగం నుంచి వచ్చే గాలికి రెపరెపలాడటం మనం చూడొచ్చు. దక్షిణ కాశీగా పేరుతెచ్చుకున్న ఈ ఆలయానికి పురాణాలలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. శివుడు, జ్ఞాన ప్రసూనాంబికలు రాహు కేతులుగా వెలిసినట్లు చెబుతుంటారు. అందుకే రాహు, కేతు దోష నివారణ పూజకు ఈ ఆలయం ప్రసిద్ది చెందింది. దీంతో జాతకాంలో రాహు కేతు దోష నివారణ కోసం భారీ సంఖ్యలో భక్తులు ఇక్కడకు వస్తుంటారు. మొన్న ఆదివారం ఆషాడం మాసం అమావాస్య తిథి కాబట్టి రాహుకేతు పూజలు నిర్వహించేందుకు భక్తులు చాలా మంది వచ్చారు. భక్తుల రాక గత రికార్డులను బద్దలు కొట్టింది. రాహుకేతు పూజల్లో 9,168 మంది భక్తులు పాల్గొన్నారు. గత ఏడాది జూన్ 18న 7,597 మంది రాహుకేతు పూజల్లో పాల్గొని సృష్టించిన రికార్డ్ ఇప్పుడు చెరిగిపోయింది.
రాహుకేతు పూజల కోసం 5,183 మంది భక్తులు 500 రూపాయల టిక్కెట్లు కొన్నారు. 2,288 మంది 750 రూపాయల టిక్కెట్ల కొన్నారని దేవస్థాన అధికారులు చెప్పారు. అంతేకాదు 1,500 రూపాయల టికెట్ ను 933 మంది.. 2,500 రూపాయల టికెట్టును 610 మంది కొన్నారని అధికారులు చెబుతున్నారు. 154 మంది భక్తులు 5,000 రూపాయల టిక్కెట్ల ను కొనుగోలు చేసి రాహు కేతు పూజ చేశారు. రాహుకేతు(Rahu Ketu)పూజలతో పాటు శీఘ్ర దర్శనం, ప్రత్యేక ప్రవేశం కోసం 8,162 టిక్కెట్ల అమ్మకాలు జరిగాయి. మరో వైపు ఆదివారం ఒక్క రోజే 29,505 వివిధ ప్రసాదాల ప్యాకెట్లను విక్రయించినట్లు తెలిపారు. ఇలా కాళహస్తి ఆలయానికి ఒక్కరోజులో కోటి రూపాయల ఆదాయం వచ్చిందని తెలిపారు.