Raghurama Krishna Raju: మార్పు ఉండదని తేల్చేసిన బీజేపీ.. రఘురామ ఏమి చేయబోతున్నారో?
తాజాగా ఈ అంశంపై బీజేపీ క్లారిటీ ఇచ్చింది. భారతీయ జనతా పార్టీ ప్రకటించిన అభ్యర్థుల విషయంలో
కూటమిలో భాగంగా నరసాపురం ఎంపీ స్థానాన్ని బీజేపీ తీసుకుంది. ఆ పార్టీ శ్రీనివాసవర్మను లోక్ సభ ఎన్నికల బరిలోకి దించింది. అంతకు ముందు రఘురామ కృష్ణ రాజు వైసీపీ తరపున పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత చోటు చేసుకున్న ఘటనల తర్వాత ఆయన వైసీపీకి దూరమయ్యారు. ఎవరో ఒకరు తాను చేసిన పోరాటానికి మెచ్చి తనకు టికెట్ ఇచ్చే అవకాశం ఉందనే భావిస్తూ వచ్చారు. ఇటీవలే టీడీపీలోకి చేరారు. కొన్ని పార్టీలు ఆఖరి నిమిషంలో అభ్యర్థులను మారుస్తున్న సంగతి తెలిసిందే!! అందులో భాగంగా రఘురామ తనకు నరసాపురం టికెట్ కావాలని పట్టు బట్టారు. అయితే ఆయన అనుకున్నది జరిగేలా కనిపించడం లేదు.
తాజాగా ఈ అంశంపై బీజేపీ క్లారిటీ ఇచ్చింది. భారతీయ జనతా పార్టీ ప్రకటించిన అభ్యర్థుల విషయంలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది. ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ సిద్ధార్థ్ నాథ్ మాట్లాడుతూ లోక్ సభ అభ్యర్థిగా శ్రీనివసవర్మ బరిలో ఉంటారని చెప్పారు. అయితే ఇక ఆర్ఆర్ఆర్ కు నరసాపురం ఎంపీగా పోటీ చేసే అవకాశాలు అంతంతమాత్రమే అని అనిపిస్తూ ఉంది. ఇక రఘురాజు ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో పట్టు సాధించాలని అనుకుంటూ ఉన్నారు. ఇప్పటికే ఉండి శాసనసభ అభ్యర్థిగా రామరాజును టీడీపీ ప్రకటించింది. రామరాజు కూడా పోటీ నుంచి తప్పుకునేందుకు సిద్ధంగా లేరు. ఎన్నికల్లో తాను కచ్చితంగా పోటీ చేస్తానని అంటున్నారు. రఘురామ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే విషయం ఆసక్తికరంగా మారింది. అసలు రఘురామ ఎన్నికల్లో పోటీ చేస్తారా అనే అనుమానాలు కూడా ఉన్నాయి.