R. Krishnaiah Join To BJP:బీజేపీలో చేరుతున్నారు... రాజ్యసభ పదవి కన్ఫామ్ చేసుకున్నారు!
రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆర్.కృష్ణయ్యకు మళ్లీ ఆ పదవి దక్కబోతున్నది.
రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆర్.కృష్ణయ్యకు మళ్లీ ఆ పదవి దక్కబోతున్నది. ఈసారి భారతీయ జనతా పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడు కాబోతున్నారు. బీసీ ఉద్యమ నాయకుడిగా పేరు గడించిన కృష్ణయ్య తెలంగాణకు చెందిన వారైనప్పటికీ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యులయ్యారు. వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి అభిమానంతో ఆయనకు ఆ పదవి ఇచ్చారు. మొన్నటి ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పరాజయం పాలు కావడంతో వైసీసీ తరఫున రాజ్యసభకు ఎన్నికైన ముగ్గురు సభ్యులు రాజీనామా చేశారు. అందులో కృష్ణయ్య కూడా ఒకరు. ఈ మూడు స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో మోపిదేవి వెంకటరమణ రాజీనామాతో ఖాళీ ఏర్పడిన స్థానం మాత్రమే ఇతరులతో భర్తీ కానుంది. ఇది తెలుగుదేశంపార్టీకి దక్కనుంది. మూడింటిలో రెండు తెలుగుదేశంపార్టీకి, ఒకటి బీజేపీకి అనుకున్నారు. బీజేపీ అభ్యర్థి ఎవరో అధిష్టానం నిర్ణయిస్తుందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి రెండు రోజుల క్రితం చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆర్.కృష్ణయ్యతో ఆ సీటు భర్తీ చేయనున్నారని తెలిసింది. 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆర్.కృష్ణయ్య తెలుగుదేశంపార్టీలో చేరారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎల్‌బినగర్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆయన దురదృష్టం కొద్దీ టీడీపీ తెలంగాణలో గెలవలేదు. కొన్నాళ్ల పాటు టీడీపీలోనే ఉన్నారు. తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేశారు. 2019లో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఆయన జగన్‌తో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకున్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధికారానికి దూరం కావడంతో ఆ పార్టీకి, పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు టీడీపీ అయిపోయింది, వైసీపీ కూడా అయిపోయింది. ఇప్పుడు బీజేపీలో చేరబోతున్నారు. ఈ పార్టీలో ఎంతకాలం ఉంటారో మరి!