ఇలా దొంగచాటుగా డ్రోన్లను పంపడం కాకుండా ధైర్యముంటే నేరుగా రావాలని

బాపట్ల జిల్లా మేదరమెట్ల వద్ద నిర్వహించిన ‘సిద్ధం’ సభ సూపర్ హిట్ అయిందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఓ ప్రైవేట్ డ్రోన్ వచ్చిందని వైసీపీ నేతలు ఆరోపించారు. ‘సిద్ధం’ సభా వేదిక వద్ద కుడి వైపు ఓ ప్రైవేట్‌ డ్రోన్‌ ఎగరటాన్ని పలువురు గుర్తించారు. దీనిపై వైసీపీ నేతలు స్పందించారు. మంత్రి అంబటి రాంబాబు దాన్ని స్వాధీనం చేసుకోవాలని పోలీసులకు సూచించారు. అనుమతి లేకుండా ఇక్కడ డ్రోన్‌ ఎలా ఎగరవేస్తున్నారు? ఎవరు ఆపరేట్‌ చేస్తున్నారు? అని ప్రశ్నించారు.

టీడీపీ నేత నారా లోకేష్‌ ఇలా దొంగచాటుగా డ్రోన్లను పంపడం కాకుండా ధైర్యముంటే నేరుగా రావాలని నరసరావుపేట పార్లమెంట్‌ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త అనిల్‌ కుమార్‌ యాదవ్‌ సవాల్‌ చేశారు. ఎక్కడో ఉండి డ్రోన్ పంపించి, ఖాళీ స్థలాలను చూపి, సిద్ధం సభలకు జనం రాలేదని చెప్పడం కాదనీ.. దమ్ముంటే ఇక్కడికి రావాలంటూ అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జగన్‌ను ఎదుర్కొనే దమ్ము ఎవరికీ లేదని, అందుకే పొత్తులు పెట్టుకున్నారని అనిల్‌ కుమార్‌ యాదవ్‌ అన్నారు. వైసీపీని ఎదుర్కోవడానికి ఎంతమంది వచ్చినా జగన్‌ మరోసారి గెలిచి సీఎం అవుతారని అన్నారు. జగన్ కు అన్ని వర్గాల వారి మద్దతు ఉందని చెప్పారు. జగన్ ను మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలకు ఉందని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.

Updated On 10 March 2024 11:13 PM GMT
Yagnik

Yagnik

Next Story