Pothina Mahesh: చంద్రబాబుకు పాలేరులాగా పనిచేస్తున్న పవన్ కళ్యాణ్
ఇది తనకు తెలిసిన లెక్క అని, తెలియనివి ఇంకెన్ని ఉన్నాయోనన్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాటలకు, చేతలకు పొంతన ఉండడం లేదని వైసీపీ నేత పోతిన మహేశ్ విమర్శించారు. 2014లో పవన్ మాట్లాడుతూ తానో సాధారణ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నానని, కారు ఈఎంఐ కట్టకపోతే పట్టుకెళ్లిపోయారని చెప్పారని.. అలాంటి పవన్ ఆస్తులు ఇప్పుడు రూ. 1500 నుంచి రూ. 2 వేల కోట్లకు ఎలా చేరుకున్నాయని ప్రశ్నించారు. ఇది తనకు తెలిసిన లెక్క అని, తెలియనివి ఇంకెన్ని ఉన్నాయోనన్నారు. ఒకప్పుడు ఇలా ఉన్న వ్యక్తి ఈ పదేళ్లలో అలా సంపాదించడానికి గల కారణమేంటో చెబితే పేదలు కూడా సంపాదించుకుంటారన్నారు. పవన్ రాజకీయాల్లోకి వచ్చి నమ్ముకున్న తనలాంటి వారినందరినీ అమ్ముకుని వేలకోట్ల ఆస్తులు, భూములు సంపాదించారని ఆరోపించారు. మార్పు కోసం తమను పనిచేయమన్న పవన్.. ఆయన మాత్రం చంద్రబాబుకు పాలేరులాగా పనిచేస్తున్నారన్నారు. పవన్ కళ్యాణ్ ఒక పొలిటికల్ ఫోర్‌ట్వంటీ అని విమర్శలు గుప్పించారు పోతిన మహేష్.
ప్రజారాజ్యం పార్టీని నడపలేక చిరంజీవి ఎత్తేస్తే.. పవన్ పార్టీ పెట్టడానికి డబ్బులు తీసుకున్నాడని ఆరోపణలు చేశారు. గత ఎన్నికల్లో ప్రజలు ముందే గ్రహించి తీర్పు ఇచ్చారన్నారు. ఈ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనీవ్వను అంటు బాబుకే ఊడిగం చేస్తున్నారన్నారు. ఎన్నారైలు, కాపు సామాజిక వర్గం ఇచ్చిన డబ్బులు పవన్ వాడుకున్నాడని విమర్శించారు. పవన్ కుటుంబ సభ్యులే ఆయనకు బినామీలు అంటూ ఆరోపణలు చేశారు. పవన్ కళ్యాణ్ చాలా ఆస్తులు కొన్నాడన్నారు.. హైదరాబాద్‌లో జనసేన పార్టీ కార్యాలయం ఒకప్పుడు అద్దె భవనమని, ఇప్పుడు సొంత భవనం అయిందని అన్నారు. ఇంకా రిజిస్ట్రేషన్ అవ్వలేదన్నారు.