Posani krishnamurali : కోర్టుకు హాజరయ్యే సమయంలో నన్ను చంపేందుకు లోకేశ్ కుట్ర
తెలుగుదేశం పార్టీ(TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై(nara lokesh) ఎఫ్ డీ సీ చైర్మన్ పోసాని కృష్ణమురళి(Posani krishnamurali) సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ లోకేశ్ తనను చంపేందుకు కుట్ర చేస్తున్నారని, పరువు నష్టం దావా కేసులో తాను కోర్టుకు హాజరయ్యే సమయాల్లో తనను హత్య చేయాలని భావిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేసారు. తాను చనిపోతే అందుకు లోకేశ్‌దే బాధ్యత అన్నారు. పోసానిని ఎలిమినేట్ చేయడమే ఆయన ఉద్దేశ్యమన్నారు.
ఎఫ్ డీ సీ చైర్మన్ పోసాని కృష్ణమురళి సంచలన వ్యాఖ్యలు
పరువు నష్టం దావా కేసులో తాను కోర్టుకు హాజరయ్యే సమయంలో హత్యకు కుట్రపన్నారు
కొడాలి నాని బూతులతో సమాజానికి నాశనమా?
తనను చంపేస్తే అందుకు లోకేశ్ బాధ్యుడన్న పోసాని
తెలుగుదేశం పార్టీ(TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై(nara lokesh) ఎఫ్ డీ సీ చైర్మన్ పోసాని కృష్ణమురళి(Posani krishnamurali) సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ లోకేశ్ తనను చంపేందుకు కుట్ర చేస్తున్నారని, పరువు నష్టం దావా కేసులో తాను కోర్టుకు హాజరయ్యే సమయాల్లో తనను హత్య చేయాలని భావిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేసారు. తాను చనిపోతే అందుకు లోకేశ్‌దే బాధ్యత అన్నారు. పోసానిని ఎలిమినేట్ చేయడమే ఆయన ఉద్దేశ్యమన్నారు. పరువు నష్టం పేరుతో తనను లోపలకు, బయటకు (కోర్టుకు) తిప్పాలని, ఆ తర్వాత తనను లేపేయాలని ఆయన ఆలోచన అని తనకు సమాచారం అందిందని ఆయన తెలిపారు. ఇది తన మరణవాంగ్మూలమన్నారు. తాను చావడానికి భయపడే వ్యక్తిని కాదన్నారు. నారా లోకేశ్ మాట్లాడిన మాటలకు పరువు నష్టం దావా వేయవద్దా? అలా వేస్తే ఆయన కనీసం ఇరవై ఏళ్లు జైల్లో ఉంటారన్నారు. ఆయన ఎవరిపైనా విమర్శలు చేయలేదా? అని నిలదీశారు. ఈ వ్యక్తి తనపై రూ.4వేల కోట్ల పరువు నష్టందావా వేశారన్నారు. భూమికొన్నాడంటే పరువు నష్టం అయిందట అని ధ్వజమెత్తారు. హెరిటేజ్ పేరుతో భూములు కొన్నది నిజంకాదా? అని ప్రశ్నించారు. లోకేశ్ పీఏ తనను టీడీపీలోకి ఆహ్వానించారన్నారు. కొందరు బూతుల మంత్రులు అంటుంటారని, కానీ బూతు పనులు అంతకంటే దారుణమన్నారు. కొడాలి నాని మాట్లాడిన బూతులు సమాజానికి నాశనమా? లేక బూతు పనులు చేసేవారి వల్లనా? ఆలోచించాలన్నారు. కొడాలి మాట్లాడే మాటల కంటే వారి వల్లే ఎక్కువ నాశనమన్నారు. తాను రామోజీరావును బ్రోకర్ అన్నానని, ఎందుకంటే అమరావతిలో రాజధాని వస్తుందని ఆయనకు ముందే తెలుసునని చెప్పారు. తనను కూడా అక్కడ భూములు కొనమని చెబితే, అలాంటి పాపాలు తనకు వద్దని, కష్టపడి తింటానని కొనుగోలు చేయలేదన్నారు.
చంద్రబాబు ఏ వ్యవస్థనైనా మేనేజ్ చేయగల సమర్థుడని ఆరోపించారు. చంద్రబాబుపై ఎన్ని కేసులు ఉన్నప్పటికీ జైలుకు వెళ్లలేదన్నారు. కొంతమందికి కులపిచ్చిని ఎక్కించి తనను తిట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. కమ్మవాడే గెలవాలనుకోవడం సరికాదన్నారు. ఎవరైనా గెలిస్తే మంచి చేస్తున్నారా? లేక చెడు చేస్తున్నారా? అన్నది చూడాలన్నారు. కానీ కులం చూడవద్దన్నారు. కులాభిమానం ఉండవచ్చునని, కానీ దురభిమానం ఉండవద్దన్నారు. రైతుల కష్టాలు తీర్చడానికి వైఎస్ రూ.11వేల కోట్ల రుణమాఫీ చేశారని, కులాలకు అతీతంగా ఈ మాఫీ జరిగిందన్నారు. అప్పుడు రుణమాఫీ వద్దని రైతులు చెప్పారా? అన్నారు. అమరావతిలో ఐదు శాతం భూములు పేదలకు పంచి పెట్టాలని చట్టంలో ఉందని, ఆ చట్టాన్ని నాడు చంద్రబాబు తుంగలో తొక్కారన్నారు. ఇప్పుడు భూమిని పేదలకు ఇస్తే రైతులు అడ్డుకోవద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు. తనకు ఉన్న ఆస్తులన్నీ ఇచ్చేస్తానని, రైతులు ఒక సెంట్ భూమి ఇస్తే చాలన్నారు. తనకు ఐదెకరాల పొలం సహా పలు ఆస్తులు ఉన్నాయని, అవసరమైతే వాటిని కూడా ఇచ్చేస్తానన్నారు. తల్లి సాక్షిగా తాను ఈ మాట చెబుతున్నా అన్నారు. కానీ రైతులు మాత్రం పేదలకు ఇవ్వాల్సిన భూములపై వేసిన కేసును వెనక్కి తీసుకోవాలని కోరారు. రైతు సోదరులారా ఇదే నా విజ్ఞప్తి. కేసు వెనక్కి తీసుకోవడంపై ఆలోచన చేయాలన్నారు. తనకు లోకేశ్ కంటే క్రెడిబులిటీ ఉందన్నారు. తాను అమ్ముడుపోయే వ్యక్తిని కాదన్నారు. జగన్ గుణం నచ్చి తాను ఇష్టపడినట్లు చెప్పారు. 1983లో ప్రజలు ఎన్టీఆర్‌ను గెలిపించారని, ఆ తర్వాత కాంగ్రెస్‌కు పట్టం గట్టారని, ఆ తర్వాత మళ్లీ ఎన్టీఆర్‌ను, మరోసారి కాంగ్రెస్‌ను గెలిపించారని, ఇలా ప్రజలు తమకు ఎవరు బాగు చేస్తారని భావిస్తే వారికి ఓటు వేస్తారని, తాను కూడా అలాగేనని అన్నారు.