Chandrababu-Jr NTR : చంద్రబాబుతో ఎన్టీఆర్ భేటికి ముహూర్తం ఖరారు!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(chandrababu) తెలివైన రాజకీయ నాయకుడు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(chandrababu) తెలివైన రాజకీయ నాయకుడు. ఆయనకు ఎవరిని ఎప్పుడు దగ్గరకు తీసుకోవాలో, ఎవరిని ఎప్పుడ దూరం పెట్టాలో బాగా తెలుసు! అందుకే నాలుగున్నర దశాబ్దాలుగా రాజకీయాల్లో అప్రతిహతంగా కొనసాగుతూ వస్తున్నారు. టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌ను(Jr NTR) చంద్రబాబే దూరం పెట్టారా? లేకపోతే తారకే దూరం జరిగారా అన్నది ఇప్పటికీ మిస్టరీనే! 2009 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ నేతృత్వంలోని మహా కూటమికి మద్దతు పలికారు. చంద్రబాబు ఆహ్వానం మేరకు కూటమికి విస్తృతంగా ప్రచారం చేశారు. ఖాకీ దుస్తులు ధరించి తన తాత సీనియర్ ఎన్టీఆర్‌ను గుర్తుకు తెచ్చారు. ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు. అనర్గళంగా మాట్లాడుతూ ప్రజలను ఆకట్టుకున్నారు. ఇంత చేసినా అప్పుడు టీడీపీ విజయం సాధించలేదు. ఇక అప్పట్నుంచి నెమ్మదిగా టీడీపీకి దూరమయ్యారు. ఇదే సమయంలో చంద్రబాబుకు వియ్యంకుడు, ఎన్టీఆర్‌కు బాబాయ్ వరుస అయ్యే బాలకృష్ణతో కూడా అంతరం పెరిగింది. నందమూరి అభిమానులు కూడా రెండుగా చీలిపోయారు. ఇదంతా గతం! ఇప్పుడు రాజకీయ పరిస్థితులు మారాయి. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా ద్వారా చంద్రబాబుకు అభినందనలు తెలిపారు. 'ప్రియమైన Nara Chandrababu Naidu మావయ్యకి ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించినందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు… మీ ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపున నడిపిస్తుందని ఆశిస్తున్నాను.
అద్భుతమైన మెజారిటీతో గెలిచిన Nara Lokesh కి, మూడోసారి ఘన విజయం సాధించిన Nandamuri Balakrishna బాబాయికి, MPలుగా గెలిచిన Sribharat Mathukumilli కి, Daggubati Purandeswari అత్తకి నా శుభాకాంక్షలు' అని రాసుకొచ్చారు. ఇందుకు చంద్రబాబు కూడా పాజిటివ్‌గా స్పందించారు. అప్పుడే ఇద్దరి మధ్య ఎడం బాగా తగ్గింది. తెలుగుదేశం అభిమానులు కూడా హ్యాపీగా ఫీలయ్యారు. అయితే ఆ తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం చేస్తున్నప్పుడు ఎన్టీఆర్ వెళతారని అనుకున్నారు. కానీ అది జరగలేదు. అయినప్పటికీ ఎప్పుడెప్పుడు వీరిద్దరు కలుసుకుంటారా అని అభిమానులు అయితే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారి ఎదురుచూపులు ఫలించే రోజు దగ్గరలోనే ఉందని తెలుస్తోంది. వీరిద్దరిని కలపడానికి ఓ అగ్రదర్శకుడు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు, తారక్ భేటికి కసరత్తు చేస్తున్నారు. ఇందుకు చంద్రబాబు, తారక్ కూడా పాజిటివ్‌గానే రియాక్టయ్యారని వినికిడి! ఇదే జరిగితే తారక్ రాజకీయాల్లో కూడా యాక్టివ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణలో టీడీపీ బలోపేతం కావడానికి ఎన్టీఆర్ దోహదపడతారన్నది అధినాయకత్వం ఆలోచన కావచ్చు. ఏమైనప్పటికీ సుదీర్ఘ విరామం తర్వాత మామ అల్లుళ్లు కలవబోతున్నారు. ఆ సమయం ఎప్పుడన్నది త్వరలో తెలుస్తుంది.