Minister Botsa Satyanarayana : అంగన్వాడీల 10 డిమాండ్లను నెరవేర్చాం
పలు జిల్లాల్లో అంగన్‌వాడీలు విధుల్లో హాజరవుతున్నారని మంత్రి బొత్స సత్య నారాయణ తెలిపారు. రెండు మూడు జిల్లాల్లో పూర్తిస్థాయిలో తిరిగి విధులకు హాజరయ్యారని..

Please attend your duties Minister appeals to Anganwadis
పలు జిల్లాల్లో అంగన్‌వాడీ(Anganwadis)లు విధుల్లో హాజరవుతున్నారని మంత్రి బొత్స సత్య నారాయణ(Minister Botsa Satyanarayana) తెలిపారు. రెండు మూడు జిల్లాల్లో పూర్తిస్థాయిలో తిరిగి విధులకు హాజరయ్యారని.. మిగిలిన జిల్లాల్లోకూడా అంగన్‌వాడీలు తిరిగి విధులకు హాజరవుతారని.. జాయిన్ అవుతున్నవారందరికీ ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలియజేశారు మంత్రి. మిగిలిపోయిన వారు కూడా వెంటనే విధులకు హాజరుకావాలని కోరారు. ఈ ప్రభుత్వం అందరి ప్రభుత్వమని మరోసారి గుర్తుచేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి అధికారంలోకి రాగానే జీతాలు పెంచామన్నాని తెలిపారు. మీరు కోరకపోయినా అనేక సౌకర్యాలు, సదుపాయాలు కల్పించామని వెల్లడించారు. ప్రస్తుతం ఆందోళన సమయంలో కూడా అనేక డిమాండ్లను అంగీకరించామని.. 13 డిమాండ్లలో 10 డిమాండ్లను నెరవేర్చామని తెలిపారు. వాటిని అమల్లోకి తెచ్చేలా ప్రభుత్వం తరఫున ఉత్తర్వులు కూడా జారీచేశామని వివరించారు. మిగిలిన డిమాండ్ల పట్ల సానుకూలంగా ఉన్నామని.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో వీటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రాజకీయ శక్తుల చేతుల్లో చిక్కుకోవద్దని అంగన్‌వాడీలను కోరారు. మీ అందోళన వేదికగా రాజకీయ పబ్బం గడుపుకోవాలని కొన్ని పార్టీలు, కొన్ని రాజకీయ శక్తులు యత్నిస్తున్నాయని.. అలాంటి వాటికి ఆస్కారం ఇవ్వొద్దన్నారు. బాలింతలు, శిశువులకు ఇబ్బందిరాకుండా వెంటనే మీ సేవలు వారికి అందించాల్సిన అవసరం ఉందని.. విధులకు హాజరుకాని మిగిలిన వారు కూడా వెంటనే హాజరుకావాలని కోరారు. మీ సేవలు వారికి చాలా అవసరమని భావించి ఈ విజ్ఞప్తిచేస్తున్నామన్నారు.
